- న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్ కం
- హైదరాబాద్ లో 1198 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
- పోలీసులు హెచ్చరించినా బేఖాతర్ చేసిన పౌరులు
హైదరాబాద్, మహా : కొత్త సంవత్సరానికి హైదరాబాద్ గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పింది. న్యూ ఇయర్ అర్ధరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రం నమోదు అయ్యాయి. తాగి రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా.. మందుబాబులు మాత్రం వచ్చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా బుక్కయ్యారు. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 కేసులు నమోదైనట్టుగా పోలీసులు వెల్లడించారు. గత రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీల్లో కేసులు నమోదు చేశారు. పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ హైదరాబాద్ అంటే
న్యూ ఇయర్ నైట్‌పై సజ్జనార్ కామెంట్స్
హైదరాబాద్ ప్రజలపై సీపీ సజ్జనార్ ప్రశంసలు కురిపించారు. నూతన సంవత్సరం వేళ ప్రజలు ఎంతో బాధ్యతయుతంగా ప్రవర్తించారని చెప్పారు. న్యూ ఇయర్ 2026కు అంతా స్వాగతం పలికారు. అయితే ఈసారి హైదరాబాద్ పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండా.. ముందస్తుగానే కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి ప్రమదాలు జరగకూడదని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. పబ్బులు, క్లబ్బుల దగ్గర నుంచి తాగి వాహనాలు నడపొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాలు భారీగా ఉంటాయని చెప్పారు. దీంతో జనాలు కూడా జాగ్రత్తగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. నగరంలో ఎటువంటి సంఘటనలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరిగాయని, పెద్ద ప్రమాదాలు ఏవీ జరగలేదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. పోలీసుల కఠినమైన ఆంక్షలు, నగరం అంతటా అవగాహన ప్రచారాలతో సురక్షితంగా న్యూ ఇయర్ జరుపుకొన్నారని సజ్జనార్ చెప్పారు.
రోడ్డు భద్రతను నిర్ధారించడంలో పోలీసులు, పౌరుల సమిష్టి కృషిని సీపీ సజ్జనార్ ప్రశంసించారు. మద్యం తాగి వాహనాలు నడపడంపై చర్యలు, ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమాలు ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ‘ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. అవగాహన పనిచేసింది, బాధ్యత గెలిచింది, ప్రజా సహకారం గొప్పది. హైదరాబాద్‌ను సురక్షితమైన ప్రపంచ నగరంగా మార్చడానికి పౌరులు కలిసి పనిచేయాలి.’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. రోడ్డు భద్రత సందేశాన్ని సజ్జనార్ బలంగా చెప్పారు. వేడుకలకు ఎప్పుడూ ప్రాణాలను పణంగా పెట్టకూడదని, మద్యం మరియు డ్రైవింగ్ ఎప్పుడూ కలిసి ఉండకూడదని గుర్తు చేశారు. ప్రమాదాలు లేని వేడుకలు సాధ్యమేనని నగరం చూపించిందన్నారు. హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, గ్లోబల్ సిటీగా మార్చేందుకు కలిసి ముందుకు సాగుదాం.. హైదరాబాద్ నేర్పింది ఒక్కటే.. రిస్క్ లేకుండా సెలబ్రేషన్ ఉండొచ్చు అని సజ్జనార్ అన్నారు.








