- న్యూ ఇయర్ కిక్కు
- వెయ్యి కోట్ల మద్యం హాంఫట్
- ఖజానాకు కాసులే … కాసులు
- తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
- డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.1.000 కోట్ల మద్యం విక్రయాలు
- చివరి మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు
- డిసెంబర్ 30న రూ.520 కోట్ల అమ్మకాలు
హైదరాబాద్, మహా : తాగుదాం తాగి ఊగుదాం అన్నట్లుగా మద్యం ప్రియులు ఈ ఏడాది న్యూ ఇయర్ కు ఘన స్వాగతం పలికారు. మద్యం కిక్కులో ఎవరేం చేస్తున్నారో తెలియని స్థితిలో కొంత తాగి పడిపోగా, మరికొంత తాగి ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదిచారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో కలిపి మూడు రోజుల్లోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆరు రోజుల్లో మొత్తం రూ.1,350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో రూ.520 కోట్ల అమ్మకాలు జరగగా, 31న రూ.370 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. తెలంగాణలో డిసెంబర్ మొదటి పదిహేను రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కూడా మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. డిసెంబర్ నెలలో నూతన సంవత్సర వేడుకలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో 2024 డిసెంబర్‌తో పోలిస్తే మద్యం విక్రయాలు రూ.1,349 కోట్లు అధికంగా జరిగాయి.
గత రికార్డు బ్రేక్
కాగా, 2025 డిసెంబర్‌లో చివరి ఐదు రోజుల వ్యవధిలోనే రూ. 1,344 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలా ఒకే నెలలో రూ. 5 వేల కోట్లకు మించి లిక్కర్ సేల్స్ జరగడం ఇదే తొలిసారి అని.. దీన్ని ఆల్‌టైం రికార్డ్‌గా పేర్కొంటున్నారు. 2023 డిసెంబర్‌లో నమోదైన మద్యం అమ్మకాల రికార్డు రూ. 4,300 కోట్లను ఈ డిసెంబర్ బ్రేక్ చేసింది. మద్యానికి డిమాండ్ పెరగడంతో.. సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు వేసింది.
లిక్కర్ సేల్స్ పెరగడానికి కారణాలివే
2025 డిసెంబర్‌లో లిక్కర్ సేల్స్ పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నిక వేళ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దానికి తోడు న్యూఇయర్ వేడుకలు కూడా తోడయ్యాయి. అంతేకాకుండా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా.. కొత్తగా ఏర్పాటైనా మద్యం షాపుల్లో అనేక రకాల మద్యం బ్రాండ్లు, ఫ్లేవర్లు అందుబాటులో ఉంచారట. దీని వల్ల కూడా న్యూఇయర్ వేడుకల వేళ అమ్మకాలు జోరుగా సాగినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉండేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. అమ్మకాలు మరింత పెరగడానికి ఇవి దోహదం చేశాయి. లిక్కర్ సేల్స్ పెరగడంతో కొత్తగా ప్రారంభించిన మద్యం దుకాణాల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీని వల్ల ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.
2025 డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రికార్డు క్రియేట్ చేయడం ఇది రెండో సారి. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో.. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. నాలుగు రోజుల్లో దాదాపు రూ. 600 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగాయని చెప్పారు. చలి పులి పంజా విసిరినా.. బీర్ల అమ్మకాలు జోరుగా సాగడం గమనార్హం. అందుకే నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని అధికారులు చెప్పారు.







