- ప్రశ్నా పత్రాల లీకేజీలకు కారకులను కఠినంగా శిక్షించాలి
- చర్యలు లేక పోవడంతోనే సీబీఎస్ఈకీ విస్తరించిన గ్లోబరీనా అక్రమాలు
- కోచింగ్ సెంటర్లపై దేశ వ్యాప్తంగా ఒక విధానం అవసరం
- కేసీఆర్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు
- హైడ్రా పనులు భవిష్యత్‌లోనూ కొనసాగిస్తుంది
- ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, మహా : ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ, అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయని సీఎం విమర్శించారు. ఈ విషయంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సీఎం సూచించారు. విద్యను వీలైనంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం తక్కువగా ఉంటుందని, ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సి ఉందన్నారు. సభలో చర్చ జరిగితే రాహుల్ గాంధీ అన్ని అంశాలపై మాట్లాడతారని సీఎం తెలిపారు.
ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని చూసి తర్వాత రాష్ట్రంలో ఏం చేయాలనేది చూస్తామని సీఎం ఒక ప్రశ్నకు బదులిచ్చారు. యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని సీఎం తెలిపారు. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు. గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించి, వాటిని గందరగోళం చేశారని సీఎం విమర్శించారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.
వీబీజీ రాం పథకంలో ఇందిరమ్మ ఇళ్ళను చేర్చాలి
ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి పనుల విషయంలో సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పరిస్థితుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు.
ఏపీలోనూ ఫీజురిఎంబర్స్ మెంట్ బకాయిలున్నాయి
ఫీజురీయింబర్స్‌మెంట్ కు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం రూ.8వేల కోట్లను బకాయిలను పెట్టి పోయిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలనుకునే సంస్థలమీద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోందని సీఎం తెలిపారు. సక్రమంగా ఉన్నవాళ్లకు బకాయిలు చెల్లిస్తామని ఓ ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. కేసీఆర్ పెట్టిన బకాయిలే తమకు భారంగా మారాయన్నారు. తాము ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నట్లుగా, మా ప్రభుత్వం కారణమన్నట్లుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందని, దానికి బీజేపీ వంతపాడుతోందని సీఎం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు బకాయిలపై బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎందుకు మాట్లాడడం లేదని సీఎం ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో డిమాండ్ చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, ఆర్.కృష్ణయ్యలకు సూచిస్తున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలే తమకు భారంగా మారాయని, అయినా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం అన్నారు. భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని, అడ్వాన్స్‌డ్‌గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రూ.2,200 నుంచి రూ.2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమవుతాయని సీఎం అన్నారు. క్రమం తప్పకుండా వాటిని చెల్లించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచించుకుందని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య రాష్ట్రంలో ఉండదని సీఎం స్పష్టం చేశారు.
హైడ్రా మంచి పనులు చేసింది
చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్క్‌లను కబ్జాలు పెట్టుకున్నోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్‌కుమార్ మీద 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం విచక్షణాధికారమని, దానిని ఎవరూ గుంజుకోలేరని సీఎం స్పష్టం చేశారు. న్యాయస్థానాల మీద తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని సీఎం తెలిపారు. హైడ్రా మంచి పనులు చేస్తోందని, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా అత్యుత్తమ సంస్థల్లో ఒకటని, ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా విధి అని, ఆ పనిని హైడ్రా పకడ్బందీగా చేస్తోందని సీఎం తెలిపారు.
బతుకమ్మకుంట లాంటి దానిని బీఆర్ఎస్‌వాళ్లు కబ్జా పెట్టుకున్నారని, దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారని సీఎం విమర్శించారు. ఆ కుంట పేరే బతుకమ్మ కుంట అని, దానిపై కేసు నడుస్తోందని, వాటిని ఏవిధంగా చూడాలని సీఎం ప్రశ్నించారు. హైడ్రాని పనిచేయకుండా అడ్డుకోవాలనే కబ్జాకోరులకు సహకరించవద్దని మీడియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. హైడ్రా ఎన్ కన్వేన్షన్ కూలగొట్టింది.. అది పేదోళ్లదా? గండిపేట చెరువులో ఆక్రమణలు కూలగొట్టింది… అవి పేదోళ్లవా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నోళ్లు పేదోళ్లా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కబ్జాదారులను కాపాడటానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. హైడ్రా కారాచరణపైనా, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతలపైనా ప్రభుత్వానికి స్పష్టత ఉందని సీఎం తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వపరంగా సమీక్షిస్తామన్నారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామని, అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.







