దుష్ప్రచారంపై గడ్కరీ కోర్టుకు.
* డీప్‌ఫేక్‌లపై చర్యలు కోరిన కేంద్ర మంత్రి.
ఢిల్లీ, మహా.
తనతో పాటు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారం, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో మెటా సహా సోషల్ మీడియా వేదికలు, దుష్ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సివిల్ పిటిషన్ దాఖలు చేసి న్యాయపరమైన జోక్యాన్ని కోరారు.
పిటిషన్‌లో తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు, డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రచారం తన వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు కుటుంబ సభ్యుల గౌరవాన్ని కూడా దెబ్బతీసేలా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత సోషల్ మీడియా సంస్థలు కూడా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ-20 (E20) ఇథనాల్ వ్యాపారం ద్వారా అక్రమ లాభాలు పొందారంటూ తనపై వస్తున్న ఆరోపణలను గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఇథనాల్ బ్లెండింగ్ విధానం పూర్తిగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు దానితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ చిత్రాలను సృష్టించి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ చేస్తున్నారని గడ్కరీ పిటిషన్‌లో వివరించారు. ఇటువంటి అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టవిరుద్ధ కంటెంట్‌ను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ వ్యవహారంపై బాంబే హైకోర్టు విచారణ చేపట్టనుండగా, సోషల్ మీడియా వేదికల బాధ్యత, డీప్‌ఫేక్‌ల నియంత్రణ, తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సంబంధించి ఈ కేసు కీలకంగా మారే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.







