Mahaa Daily Exclusive

  వారేమైనా తీవ్రవాదులా?

Share

  • వారేమైనా తీవ్రవాదులా?
  • చలో సంసద్ ర్యాలీ ఘటనలో పోలీసుల తీరుపై
  • లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ, మహా : విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా లోక్‌ సభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయు గోళాలు , వాటర్ క్యానన్లు , పెల్లెట్ తుపాకులు వాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు ఏమైనా తీవ్రవాదులా? వారిపై పెల్లెట్ తుపాకులు, ఏకే-47ల స్థాయిలో బలప్రయోగం ఎందుకు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు. విద్యార్థుల సంసద్ ఛలో ర్యాలీపై జరిగిన అణచివేతపై ప్రియాంక తీవ్రంగా స్పందిస్తూ.. పార్లమెంట్ ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఇది ఈ దేశ యువతదని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు అయిన సొంత పిల్లలపై దాడి చేయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, హక్కుల కోసం ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై లాఠీలు ఝళిపించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళన వెనుక ఉన్న నిజమైన ఆవేదనను గుర్తించి, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా వారితో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

మహిళా నిరసనకారులపై వేధింపులు

ఈ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినుల పట్ల భద్రతా బలగాలు, యంత్రాంగం ప్రవర్తించిన తీరుపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమ పిల్లలను ఎందుకు ఆందోళనలకు పంపారని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దేశంలో మహిళలకు, విద్యార్థినులకు నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు లేదా అని ప్రశ్నించిన ఆమె, మహిళా ప్రాతినిధ్యాన్ని అణచివేసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

ప్రధాని మోదీ, అమిత్ షాలదే బాధ్యత

దేశంలో ప్రతి చిన్న విజయానికీ క్రెడిట్ తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి , వారిపై జరుగుతున్న దాడులకు కూడా పూర్తి బాధ్యత వహించాలని ప్రియాంక డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీలు ఈ ఘటనలపై సభ వేదికగా సమాధానం చెప్పాలని, బాధిత విద్యార్థులపై నమోదు చేసిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని గట్టిగా పట్టుబట్టారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పేపర్ లీకేజీలపై సమగ్ర చర్చ జరిపే వరకు పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.