Mahaa Daily Exclusive

  పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్ న్యూస్..

Share

  • పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్ న్యూస్
  • నేర చరిత్ర లేని విద్యార్థులను విడుదల చేయండి
  • కేసులూ ఎత్తివేయాలన్న సుప్రీంకోర్టు
  • ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలు కోరిన అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, మహా : నీట్ పేపర్ లీక్ ఆందోళన విషయంలో విద్యార్థులకు భారీ ఊరట లభించింది. నేర చరిత్ర లేని 18 ఏళ్ల విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలపై సీసీటీవీ ఫుటేజీ వీడియోలను సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఆందోళనల్లో పాల్గొన్న 3 వేల మంది విద్యార్థులలో 101 మందికి నేర చరిత్ర ఉంది, వారిలో 62 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. విద్యార్థులు, సీజేపీ ఆందోళనలో దాదాపు 200 మంది పోలీసులు గాయపడ్డారని, ఇది సాధారణ విషయం కాదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘ప్రారంభంలో ఉద్యమం ప్రశాంతంగా సాగుతుండగా, ఒక్కసారిగా హింస చెలరేగింది. దీనికి రెండు కారణాలు ఉండవచ్చు. మొదటిది పోలీసులు అతిగా కఠినంగా వ్యవహరించడం, రెండోది హింసను ప్రేరేపించాలనుకునే వ్యక్తులు నిరసనకారులలోకి ప్రవేశించడం’ అని అన్నారు. ఒకసారి ప్రొటోకాల్ తయారైతే, బాధ్యతను ఖరారు చేయడం సులభమవుతుందని ఆయన చెప్పారు.

నిరసనలు జరిగిన అన్ని రాష్ట్రాలను నిరసనలకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్, డ్రోన్ రికార్డింగ్‌లు, బాడీ-కెమెరా ఫుటేజ్, వైర్‌లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పిసిఆర్ లాగ్‌లు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిరసనకారులపై సేకరించిన ఎలాంటి డిజిటల్ డేటానైనా భద్రపరచాలని, అయితే దానిని బయటపెట్టకూడదని కూడా ఆదేశించింది. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఈ రక్షణ వర్తించదని పేర్కొంటూనే, ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని అధికారులను ధర్మాసనం నిరోధించింది. నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై విచారణను కొనసాగించడానికి ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు, ఈ విచారణ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నంత వరకు అర్హులైన నిరసనకార విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలిపింది.

పిటిషన్లలో లేవనెత్తిన ఆరోపణలపై ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీల నుండి కూడా ధర్మాసనం సమాధానాలను కోరింది. ఈ ఆరోపణలు ప్రాథమికంగా నిష్పాక్షికమైన విచారణ అవసరమని సీజేఐ అన్నారు. ఆందోళనలో గాయపడిన 200 మందికి పైగా పోలీసుల కుటుంబాల ఆందోళనలను కూడా ఈ విచారణ పరిష్కరించాలని అన్నారు. నిరసనల సమయంలో జరిగిన అన్ని హింసాత్మక ఘటనలపై సమగ్రమైన విచారణ చేయడానికి స్వతంత్ర కమిటీ లేదా ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించడానికి ముందు, కేంద్రం, సంబంధిత రాష్ట్రాలు తమ అభిప్రాయాలను, నివేదికల్ని సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పోలీసులు అతిగా ప్రవర్తించారన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ ఎందుకు జరగకూడదని కోర్టు ప్రశ్నించింది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని సీజేఐ స్పష్టం చేశారు.