ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీల అభ్యర్ధులు సాధించిన మెజార్టీలు, సాధించిన స్ధానాలు చూస్తుంటే ఏదో జరిగిందన్న అనుమానాలు వైసీపీలో నెలకొన్నాయి. అదే సమయంలో వైసీపీకి కేవలం 11 స్దానాలు మాత్రమే రావడంతో ఈ అనుమానాలకు బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది.
సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌ను కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాలపై తమ అనుమానాలు రోజు రోజుకూ బలపడుతున్నాయని వారు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. పోలింగ్ రోజు గణాంకాలకు కౌంటింగ్ రోజు గణాంకాలకు తేడా ఎందుకో ఈసీ స్పష్టత ఇవ్వాలన్నారు.
ఈవీఎంల బ్యాటరీ చార్జింగ్ స్టేటస్‌పై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని వైసీపీ నేతలు తెలిపారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతున్నాయని గుర్తుచేశారు. 175 నియోజకవర్గాల నుంచి ఫామ్ 20 డేటా ఈసీ ఇప్పటికీ ఎందుకు తెప్పించడం లేదన్నారు. తక్షణమే తమ అనుమానాలపై ఈసీ స్పందించాలన్నారు. పోలింగ్ శాతాల్లో తేడా ఉండటం, ఈసీ వెలువరించిన గణాంకాల్లో తేడా ఉండటంపైనా వారు అభ్యంతరం తెలిపారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏఏ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తెలియాలన్నారు. ఫామ్ 20 ఓట్లపై ఈ రోజుకు కూడా లెక్కలు ప్రకటించకపోవడం అసాధారణమైన చర్య అన్నారు.








