Mahaa Daily Exclusive

  బెంబేలెత్తిస్తున్నకొక్కెర వ్యాధి….

Share

  • బెంబేలెత్తిస్తున్నకొక్కెర వ్యాధి
  • గంటల వ్యవధిలోనే చనిపోయిన లక్షలాది కోళ్లు
  • భారీగా నష్టపోతున్న పౌల్ట్రీ ఫాం యాజమాన్యాలు
  • మూడు జిల్లాల్లో భారీ విధ్వంసం
  • ఆకాశాన్ని అంటనున్న చికెన్ ధరలు

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులను కొక్కెర వ్యాధి వణికిస్తోంది. ఉన్నట్టుండి వేలాది కోళ్లు కుప్పలు తెప్పలుగా మృత్యువాత పడుతున్నాయి. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లుసైతం అకస్మాత్తుగా అనారోగ్యానికిగురై చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లోని పౌల్ట్రీ రైతులను కొక్కెర వ్యాధి హడలెత్తిస్తోంది.

ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలోని ఒకే ఫారంలో దాదాపు 8వేల కోళ్లు మృతి చెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఇదే విధంగా మెదక్ జిల్లాలోని తూప్రాన్, కౌడిపల్లి, మనోహరాబాద్, వెల్దుర్తి, పాపన్నపేట మండలాల్లో కలిపి 80వేలకుపైగా కోళ్లు ఈ వ్యాధికి బలయ్యాయి. కొక్కెర వ్యాధి ఒక కోడి నుంచి మరొక కోడికి అత్యంత వేగంగా వ్యాపించడం వల్ల ఫారమ్‌లోని కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నాయని ఫౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించేలోపే కోళ్లు చనిపోతుండటంతో చికిత్సకు కూడా అవకాశం లేకుండా పోతుంది. ఫలితంగా పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి కోళ్ల ఫారాలు నడిపిస్తున్న యాజమానులు భారీగా నష్టపోతున్నారు.

ప్రస్తుతం వేసవి కాలంకు తోడు రంజాన్ మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ రూ.350 దాటేసింది. రంజాన్ తరువాత చికెన్ ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కొక్కెర వ్యాధి కారణంగా కొన్ని ప్రాంతాల్లో కోళ్ల ఫామ్ లు ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాబోయే నెలల్లో కిలో చికెన్ రేటు రూ.400 దాటే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే చికెన్ ప్రియులకు బిగ్‌షాక్ తగిలినట్లే అవుతుంది. కొక్కెర వ్యాధిని శాస్త్రీయంగా రాణికేట్ డిజీస్ (ఆర్డీ) అని పిలుస్తారు. ఈ వ్యాధి ఏ వయస్సు కోళ్లకైనా సోకుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన కోళ్లు, పిచ్చుకలు కూడా ఈ వైరస్‌ను రవాణా చేసే వాహకాలుగా పని చేస్తాయి. ముఖ్యంగా గాలి ద్వారా సోకే ఈ వైరస్ ఒక కోడికి వస్తే, గంటల వ్యవధిలోనే ఫామ్ లోని మిగతా అన్ని కోళ్లకు విస్తరిస్తూ ప్రాణాలు తీస్తోంది. అయితే, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చికిత్స లేకపోయినా.. కొన్ని నివారణ పద్దతులతో వ్యాధి వ్యాప్తిని నివారించొచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు.