దేశీయ తయారీకి రూ.11 వేల కోట్ల ప్రోత్సాహం.
* కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్.
* అసోంలోని సిల్చార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం.
* రూ.19,934 కోట్ల విలువైన ఐదు కీలక ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
* దేశీయ యంత్రాల తయారీకి ప్రోత్సాహం.
ఢిల్లీ, మహా.
నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.11,000 కోట్లతో ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ నిర్మాణ యంత్రాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీలో దేశీయ సామర్థ్యాన్ని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేయనుంది.
2026-27 నుంచి 2033-34 వరకు ఎనిమిదేళ్లపాటు ఈ పథకం అమల్లో ఉంటుంది. మొదటి రెండేళ్లు తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించగా, తర్వాత ఐదేళ్లు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందిస్తారు. చివరి ఏడాది ప్రోత్సాహకాల చెల్లింపుల పరిష్కారానికి వినియోగించనున్నారు. టన్నెల్ బోరింగ్ యంత్రాలు, భారీ తవ్వక యంత్రాలు, క్రేన్లు, లోడర్లు, డ్రిల్లింగ్ యంత్రాలు, భారీ రవాణా వాహనాలు వంటి ఏడు విభాగాల పరికరాల తయారీకి ప్రోత్సాహం లభించనుంది. అర్హత కలిగిన సంస్థలకు అదనపు విక్రయాల విలువపై 8 నుంచి 13 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. అత్యాధునిక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రూ.375 కోట్ల వరకు గ్రాంటు ఇవ్వనున్నారు.
ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. 2024-25లో ఈ పరిశ్రమ మార్కెట్ విలువ సుమారు రూ.97,500 కోట్లుగా నమోదైంది. రహదారులు, ఓడరేవులు, గృహ నిర్మాణ రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో 2029-30 నాటికి ఈ మార్కెట్ రూ.2.28 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దేశీయ తయారీని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సంస్థల పోటీతత్వం మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తోంది.
కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్
తమిళనాడులోని కామరాజర్ పోర్టు (గతంలో ఎన్నోర్ పోర్టు)లో రెండో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.4,288.26 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రూపకల్పన, నిర్మాణం, ఆర్థిక సమీకరణ, నిర్వహణ, బదిలీ విధానంలో ప్రాజెక్టు అమలవుతుంది.
900 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్న ఈ టెర్మినల్‌కు ఏడాదికి 20 లక్షల కంటైనర్ల నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. రెండు దశల్లో పనులు చేపడతారు. మొదటి దశలో 11 లక్షల టీఈయూలు, రెండో దశలో 9 లక్షల టీఈయూల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యంత భారీ కంటైనర్ నౌకలకు కూడా అనువుగా 18 మీటర్ల లోతుతో దీనిని రూపొందిస్తున్నారు. 400 మీటర్ల పొడవు, 24,346 టీఈయూల సామర్థ్యం కలిగిన భారీ నౌకలకు సేవలందించేలా నిర్మాణం చేపట్టనున్నారు.
మొదటి దశను రాయితీ ఒప్పందం కుదిరిన తర్వాత 24 నెలల్లో పూర్తి చేసి 25వ నెల నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశను 48 నెలల్లో పూర్తి చేయనున్నారు. రెండు దశల ప్రాజెక్టు వ్యయంలో మొదటి దశకు రూ.2,429.32 కోట్లు, రెండో దశకు రూ.1,858.94 కోట్లు కేటాయించారు. అదనంగా డ్రెడ్జింగ్ పనులకు పోర్టు సంస్థ సుమారు రూ.450 కోట్లు వెచ్చించనుంది.
ఈ టెర్మినల్ ద్వారా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల పరిశ్రమలకు ఎగుమతులు, దిగుమతుల రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, రసాయన పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది. నిర్మాణ దశలో ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 750 మందికి, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా.
అసోంలో రూ.2,014 కోట్లతో కొత్త విమానాశ్రయం
ఈశాన్య భారతదేశంలో విమానయాన సదుపాయాలను విస్తరించే దిశగా అసోంలోని సిల్చార్ సమీపంలో డూలూ ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూ.2,014 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుతం సిల్చార్ విమానాశ్రయం రక్షణ రంగానికి చెందిన భూమిలో పరిమిత స్థలంలో ఉండటం, కార్యకలాపాల విస్తరణకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడంతోపాటు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
కచార్ జిల్లాలోని డూలూ ప్రాంతం బరాక్ లోయకు కీలక కేంద్రంగా ఉంది. ఇక్కడ నిర్మించనున్న కొత్త విమానాశ్రయంలో 12,351 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ప్రయాణికుల టెర్మినల్ భవనం ఏర్పాటు చేయనున్నారు. రద్దీ సమయాల్లో గంటకు 800 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. 2,705 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే నిర్మించనున్నారు. ఎయిర్‌బస్ ఏ-320 తరహా విమానాల రాకపోకలకు అనువుగా కోడ్-4సీ ప్రమాణాలతో దీనిని రూపొందిస్తున్నారు. ఒకేసారి ఆరు ఏ-320 విమానాలు నిలిపేలా విమానాల పార్కింగ్ ప్రదేశం, ప్రత్యేక ఐసోలేషన్ బే కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే దక్షిణ అసోంతోపాటు పొరుగు రాష్ట్రాలకు విమానయాన అనుసంధానం మెరుగుపడనుంది. బరాక్ లోయలోని టీ తోటలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పర్యాటక రంగానికి ఊతం లభించనుంది. వాణిజ్యం, పర్యాటకం విస్తరించడంతోపాటు ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలతో అనుసంధానించడంలో కీలకంగా మారనుంది.
తపాలా శాఖకూ అదనపు నిధులు
ఈ మూడు ప్రధాన నిర్ణయాలతోపాటు తపాలా శాఖకు సంబంధించిన మరో రెండు పథకాల కొనసాగింపునకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు తపాలా కార్యకలాపాల పథకానికి రూ.1,141 కోట్లు, తపాలా శాఖ ఆస్తుల నిర్వహణ పథకానికి రూ.1,491 కోట్లు కేటాయించారు. తపాలా సేవల ఆధునికీకరణ, పార్శిల్, ఉత్తరాల రవాణా వ్యవస్థ బలోపేతం, గ్రామీణ ప్రాంతాలకు సేవల విస్తరణ, తపాలా కార్యాలయాల నిర్మాణం, పునరుద్ధరణకు ఈ నిధులు వినియోగించనున్నారు.
మొత్తంగా ఈ ఐదు నిర్ణయాలకు కేంద్రం రూ.19,934 కోట్ల ఆర్థిక కేటాయింపులకు ఆమోదం తెలిపింది. దేశీయ యంత్రాల తయారీ నుంచి సముద్ర రవాణా, విమానయానం, తపాలా సేవల ఆధునికీకరణ వరకు వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.







