Mahaa Daily Exclusive

  ఆత్మగౌరవం కోసమే వైసీపీని వీడా…

Share

ఆత్మగౌరవం కోసమే వైసీపీని వీడా.
• వెన్నుపోటు ఆరోపణలను తిప్పికొట్టిన విజయసాయిరెడ్డి.
• జగన్‌, సజ్జలపై తీవ్ర విమర్శలు.

ఢిల్లీ, మహా:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాను వెన్నుపోటు పొడిచానంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని పరివర్తన రాజనీతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే వైసీపీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలిపై ఘాటు విమర్శలు చేశారు.

నా కష్టం, త్యాగాలతోనే రాజ్యసభ సభ్యత్వం

వైసీపీలో తాను రాత్రింబవళ్లు కష్టపడ్డానని, పార్టీ కోసం చేసిన త్యాగాలు, శ్రమకు గుర్తింపుగానే రాజ్యసభ సభ్యత్వం దక్కిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అది ఎవరో ఇచ్చిన బహుమతి కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని, జగన్‌కు ఎంపీగా అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారని వ్యాఖ్యానించారు. తాను పార్టీని వీడితే వెన్నుపోటు అంటున్నవారు, గతంలో జగన్‌ కాంగ్రెస్‌ను వీడిన పరిణామాలను కూడా గుర్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా అని నిలదీశారు.

సజ్జలకు రిపోర్ట్‌ చేయమనడం అవమానమే

పార్టీలో తనను పదేపదే వివక్షకు గురిచేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనను రీజినల్‌ కోఆర్డినేటర్‌ స్థాయికి పరిమితం చేసి, గతంలో తన కింద పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని స్టేట్‌ కోఆర్డినేటర్‌గా నియమించారని చెప్పారు. ఆయనకు రిపోర్ట్‌ చేయాలని చెప్పడం తనను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా నెల్లూరులో పోటీ చేయించారని, ఢిల్లీలో ఇకపై విజయసాయిరెడ్డి రారని, అన్ని వ్యవహారాలను సీఎస్‌ చూసుకుంటారని జగన్‌ స్వయంగా కేంద్ర పెద్దలకు చెప్పారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ జగన్‌కు తెలియకుండా జరగలేదని పేర్కొన్నారు. ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడి వాస్తవాలు చేరకుండా అడ్డుకుంటోందని విమర్శించారు.

జగన్‌–షర్మిల ఆస్తుల వివాదంపై వ్యాఖ్యలు

జగన్‌, షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై స్పందిస్తూ.. గతంలో వైఎస్‌ కుటుంబానికి ఆడిటర్‌గా పనిచేసినందున ఆ కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలు తనకు తెలుసని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన అంతర్గత విషయాలను కుటుంబ సభ్యులతోపాటు తనకు, కేవీపీ రామచంద్రరావుకు కూడా చెప్పేవారని గుర్తుచేశారు. అయితే జగన్‌, షర్మిల మధ్య వివాదం వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశమని, నైతిక విలువల దృష్ట్యా వాటిని బహిరంగంగా వెల్లడించబోనని స్పష్టం చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయస్థానం నుంచి సమన్లు వస్తే మాత్రం తనకు తెలిసిన వాస్తవాలను కోర్టుకు వివరిస్తానని చెప్పారు.

డిసెంబర్‌ 3 తర్వాత చేరికలు

వైసీపీలో తనలాగే అవమానాలకు గురవుతున్న నాయకులు చాలామంది ఉన్నారని విజయసాయిరెడ్డి అన్నారు. డిసెంబర్‌ 3న పరివర్తన రాజనీతి పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పార్టీలో చేరికలు ఏ స్థాయిలో ఉంటాయో చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.