- జయలలిత భవనం సీజ్.
- జీహెచ్‌ఎంసీ కొరడా.
- బకాయిలు చెల్లించకపోవడంతో అధికారుల చర్య..
- శ్రీనగర్ కాలనీలో కలకలం.
హైదరాబాద్ మహా.
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె.జయలలితకు చెందిన నివాసాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు మంగళవారం సీజ్ చేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనానికి సంబంధించి సుదీర్ఘ కాలంగా ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ యంత్రాంగం, నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో భవనాన్ని స్వాధీనం చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో జయలలిత పేరిట ఒక భవనం ఉంది. దీనికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఫిబ్రవరి నెలలోనే జయలలితకు సంబంధించిన వ్యక్తులకు, ప్రతినిధులకు నోటీసులు అందజేశారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ సురేశ్ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే, ఆ నోటీసులపై అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పాటు బకాయిలు కూడా చెల్లించలేదు.
దీంతో మంగళవారం ఉదయం జీహెచ్‌ఎంసీ సిబ్బంది భవనం వద్దకు చేరుకుని సీజ్ చేశారు. భవన ప్రవేశ ద్వారానికి తాళాలు వేసి నోటీసులను అంటించారు. పన్నుల వసూళ్ల విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఒకప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ భవనంపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బకాయిలు చెల్లించిన తర్వాతే సీజ్‌ను తొలగించే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.








