మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా ఉన్నట్లు తెలిపారు. కాగా, దీనిపై విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది కోర్టు.
ఇటీవల కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. తనపై మంత్రి చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ పై అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ తోపాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు.
కేవలం తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని మండిపడ్డారు. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకుని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడటం దురదృష్టకరమని ధ్వజమెత్తారు.
ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలోని విస్తృతంగా ప్రచారమయ్యాయని, ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని.. ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడనే సోయి లేకుండా మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసు వేస్తామని కేటీఆర్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రముఖ నటుడు నాగార్జున కూడా కొండా సురేఖపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, చట్టప్రకారం కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్‌లో కోరారు.








