- దళిత, గిరిజన భూములపై గద్దల్లా
- వాలుతున్నారు.. ‘పేదల నోట్లో మట్టి కొడతారా?
- సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు.. రేవంత్ ఆలోచనలన్నీ భూముల పైనే!
- పిచ్చోడి చేతిలో రాయిలా ముఖ్యమంత్రి పాలన.
- అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.
- రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు!
హైదరాబాద్, మహా.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. దళిత, గిరిజన మరియు బలహీన వర్గాల అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటోందని ఆరోపిస్తూ, బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కేవలం భూముల చుట్టే భ్రమిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం అనే ఏడో గ్యారెంటీ ఇస్తామన్న ప్రభుత్వం, నేడు ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
**పేదల భూములపై గద్దల్లా వాలుతున్న సర్కార్**
పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల పేరిట లాక్కునే ప్రయత్నం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఎక్కడ అసైన్డ్ భూమి కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతూ పేదల నోట్లో మట్టికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇందిరా గాంధీ హయాంలో పేదలకు సాగు కోసం భూములు ఇస్తే, నేటి ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి ఆ పట్టా భూములను గుంజుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఈ రెండున్నరేళ్ల కాలంలోనే సుమారు పదివేల ఎకరాల దళిత, ఎస్టీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, మరో నలభై వేల ఎకరాలను లాక్కునేందుకు నోటిఫికేషన్లు సిద్ధం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. పచ్చటి పొలాల్లో పరిశ్రమలు పెడతామంటూ రైతుల జీవితాలతో ఆడుకోవడం ఏ రకమైన అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు.
**పిచ్చోడి చేతిలో రాయిలా ప్రజాపాలన**
ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహారశైలి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదని, ఎవరి మీద రాయి విసురుతాడో అర్థం కాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. మూసీ పేరుతో పేదల అపార్ట్‌మెంట్లు, హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్లు, యూనివర్సిటీ భూములు, చివరకు వ్యవసాయ మార్కెట్ భూములను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి, స్పీకర్ ఇద్దరూ ఉన్నా ఆ జిల్లాకు శని పట్టినట్లు అయ్యిందని విమర్శించారు. లగచర్లలో చేసినట్లే ఇప్పుడు పరిగిలో కూడా దౌర్జన్యాలకు తెరలేపారని, ఇది కేవలం భూముల మీద చేస్తున్న దండయాత్ర మాత్రమేనని ఆయన అభివర్ణించారు.
**పోలీసుల నిర్బంధం – ఆగిపోని బీఆర్‌ఎస్ పోరాటం**
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి గంటకో పోలీస్ స్టేషన్ మారుస్తూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. రైతుల గోస వినడానికి కళ్లాపూర్ వద్ద వేసుకున్న టెంట్లు చించివేసి, మహిళలను, రైతులను ఈడ్చుకుంటూ అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని అభివర్ణించారు. ప్రభుత్వం ఎంత అడ్డుకోవాలని చూసినా తమ పోరాటం ఆగదని, బాజాప్త రైతుల వద్దకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో పునాదులు వేసి నిధులు ఇచ్చిన ప్రాజెక్టులను ఇప్పుడు తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా, అక్కడ కూడా భూములు లాక్కునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. హైకోర్టులో ఉన్న కేసులను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
**నిరసన సెగలు..ప్రతిపక్షం డిమాండ్లు**
తక్షణమే ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత జాబితాను వెంటనే రివ్యూ చేసి రైతుల భూములకు విముక్తి కల్పించాలని, అప్పటి వరకు తమ పోరాటం విశ్రమించదని హెచ్చరించారు. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, వెంటనే టెండర్లు పిలిచి అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మించాలే తప్ప, సామాన్యుల పొలాలను నాశనం చేయకూడదని సూచించారు. చిల్లర కార్యక్రమాలు మాని, భూముల వెంట పడకుండా ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, పరిగి రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.








