Mahaa Daily Exclusive

  వలస కార్మికులకు కేంద్రం భరోసా.. ‘ఛోటూ’ సిలిండర్ల కోటా రెట్టింపు..!

Share

  •  యుద్ధ మేఘాల వేళ గ్యాస్‌ కొరతపై కేంద్రం ముందస్తు చర్యలు.
  •  రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖ.
  •  గుర్తింపు కార్డు ఉంటే చాలు.. సులభంగా ‘ఛోటూ’ కనెక్షన్లు.. బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్టే లక్ష్యం.

ఢిల్లీ , మహా.

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రధానంగా నగరాల్లో నివసించే వలస కార్మికులు, పేద వర్గాలకు గ్యాస్‌ కష్టాలు కలగకుండా ఉండేందుకు 5 కేజీల ఉచిత వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల కోటాను ఏకంగా రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారిక లేఖలు రాశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సమన్వయంతో, ఆయా రాష్ట్రాల పౌర సరఫరాల శాఖల ద్వారా ఈ సిలిండర్ల పంపిణీని వేగవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

 

**యుద్ధ ప్రభావం పడకుండా ముందస్తు వ్యూహం**

 

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర యుద్ధం అంతర్జాతీయ ఇంధన సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో గ్యాస్ కొరతను సాకుగా చూపి కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు సిలిండర్లు విక్రయించే ప్రమాదం ఉంది. దీనిని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వలస కార్మికులు చిన్న సిలిండర్లపైనే ఎక్కువగా ఆధారపడతారని గుర్తించిన ప్రభుత్వం, వారికి ఎటువంటి అంతరాయం లేకుండా ‘ఛోటూ’ సిలిండర్లను అందుబాటులోకి తెస్తోంది. గతంలో ఉన్న 20 శాతం సీలింగ్‌కు అదనంగా ఈ సరఫరా ఉండటం గమనార్హం.

 

**కోటా పెంపు..లెక్కలివే!**

 

రాష్ట్రాలకు అందించే ఈ అదనపు సిలిండర్ల కోటాను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించనున్నారు. ఈ ఏడాది మార్చి 2 మరియు 3 తేదీల్లో జరిగిన సగటు గ్యాస్ సరఫరాను ప్రాతిపదికగా తీసుకుని, దానికి అదనంగా ఈ కోటాను పెంచనున్నారు. అంటే, గతంలో సరఫరా అయిన దానికంటే రెట్టింపు స్థాయిలో సిలిండర్లు ఇకపై పౌర సరఫరాల కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంటాయి. దీనివల్ల డిమాండ్ పెరిగినా ఏ సమయంలోనూ ‘నో స్టాక్’ అనే బోర్డు కనిపించకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. పట్టణ ప్రాంతాల్లోని వలస కూలీలు అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ మొదలైనవి) చూపిస్తే చాలు, ఈ 5 కేజీల సిలిండర్‌ను సులభంగా పొందే వెసులుబాటు కల్పించారు.

 

**వలస కార్మికుల జీవితాల్లో ‘ఛోటూ’ వెలుగులు**

 

మౌలిక వసతుల కోసం నగరాలకు వచ్చే వలస కార్మికులకు భారీ సిలిండర్లు కొనడం, వాటిని తరలించడం భారంగా మారుతుంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికే కేంద్రం ‘ఛోటూ’ సిలిండర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యుద్ధం వల్ల ఏర్పడే కృత్రిమ కొరతను నివారించడం ద్వారా, సామాన్యుల వంట గదిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే ప్రభుత్వ అంతిమ ఉద్దేశం. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ జరగడం వల్ల లీకేజీలకు తావు లేకుండా, పారదర్శకతతో ఈ ప్రక్రియ సాగనుంది. తక్షణమే ఈ పెంచిన కోటాను అమలులోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

Latest