Mahaa Daily Exclusive

  పినరాయి వైఫల్యాలకు 120 నెలల పాలనే నిదర్శనం..! విజయన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..

Share

  •  కరుణాకరణ్, ఊమెన్ చాందీ కృషితోనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం.
  •  యువత వలసలతో కేరళ వృద్ధాశ్రమంగా మారుతోంది.
  •  తెలంగాణ అభివృద్ధి నమూనాను ఇక్కడా అమలు చేస్తాం.
  •  తెలంగాణకు రండి.. మా సంక్షేమ పాలనను కళ్లారా చూడండి!
  •  విజయన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్.

తిరువనంతపురం, మహా.

 

కేరళ రాజకీయ యవనికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల శంఖారావం పూరించారు. మంగళవారం కోవళంలో నిర్వహించిన యూడీఎఫ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పాలనపై విమర్శల జడివాన కురిపించారు. పినరాయి విజయన్ హయాంలోని గత 120 నెలల పాలన కేవలం వైఫల్యాలకే ప్రతీకగా నిలిచిందని దుయ్యబట్టారు. కేరళలో ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరణ్, ఊమెన్ చాందీ నిర్మించిన పంచాయతీరాజ్ వ్యవస్థ నేడు అద్భుత ఫలితాలను ఇస్తోందని, మంచి ఎక్కడ ఉన్నా అభినందించడం తమ సంప్రదాయమని పేర్కొంటూనే, ప్రస్తుత ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. పినరాయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని, రాష్ట్రంలో యూడీఎఫ్ మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

**వలసల కేరళగా మార్చిన ఎల్డీఎఫ్ సర్కార్**

 

కేరళలో ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగిత, ఉపాధి లేమిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావంతులు, అపారమైన నైపుణ్యం కలిగిన కేరళ యువతకు స్వరాష్ట్రంలో సరైన అవకాశాలు లేకపోవడంతో వారు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల కేరళలోని గ్రామాల్లో నేడు కేవలం వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం ఉన్న యువశక్తి విదేశాలకు తరలిపోవడం సరికాదని, వారు తిరిగి సొంత గడ్డపైనే ఉపాధి పొందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో తాము అమలు చేస్తున్న అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు మరియు స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధానాలను కేరళలోనూ అమలు చేసి యువతకు భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు.

 

**విజయన్ కు తెలంగాణ సవాల్!**

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలనను చూడాలని పినరాయి విజయన్ కు రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. పినరాయి విజయన్ తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నాయకులను కూడా తెలంగాణకు ఆహ్వానిస్తున్నానని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తామే చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి తాము అమలు చేస్తున్న 67 వేల ఉద్యోగ నియామకాలు, 25 లక్షల రైతు కుటుంబాలకు చేసిన రూ. 20,670 కోట్ల రుణమాఫీని పరిశీలించుకోవచ్చని సూచించారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను క్షేత్రస్థాయిలో విజయన్ స్వయంగా చూసి తెలుసుకోవాలని సవాల్ చేశారు.

 

**యూడీఎఫ్ తోనే ఊమెన్ చాందీ తరహా పాలన**

 

ఈ ఎన్నికలు కేరళ , తెలంగాణ మధ్య జరుగుతున్నవి కావని, ఇది కేవలం యూడీఎఫ్ , ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్న పోరాటమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఏం చేస్తున్నామో అది ధైర్యంగా చెబుతున్నామని, పినరాయి విజయన్ తమ సవాళ్లకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తిరిగి ఊమెన్ చాందీ తరహా పారదర్శకమైన, అభివృద్ధిదాయకమైన పాలనను అందిస్తామని వాగ్దానం చేశారు. కేరళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అభివృద్ధికి చిరునామాగా నిలిచే కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికే పట్టం కడతారని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం వైఫల్యాల బాటలో సాగుతున్న పినరాయి విజయన్ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.