Mahaa Daily Exclusive

  క్యాన్సర్‌పై మహా సమరం.. నిమ్స్‌లో అత్యాధునిక లీనాక్‌ సేవలు ప్రారంభం..!

Share

  • నిమ్స్‌లో అత్యాధునిక లీనాక్‌ సేవలు ప్రారంభం!
  •  తెలంగాణలో ‘నోటిఫైబుల్‌ వ్యాధి’గా క్యాన్సర్‌.
  •  ప్రతి కేసు నమోదుకు ప్రభుత్వం కీలక నిర్ణయం.
  •  మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.
  •  14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు.
  •  మారుమూల ప్రాంతాలకూ కీమోథెరపీ.
  •  జిల్లా కేంద్రాల్లో డే కేర్‌ సెంటర్లు.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

హైదరాబాద్, మహా.

తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో మరో విప్లవాత్మక అడుగు పడింది. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అత్యాధునిక లీనాక్ రేడియేషన్ చికిత్స సేవలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులకు మెరుగైన, ఖచ్చితమైన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నిమ్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన సాంకేతికత ద్వారా ఆరోగ్యకరమైన కణజాలానికి ఎటువంటి హాని కలగకుండా, కేవలం ట్యూమర్‌పై మాత్రమే ప్రభావం చూపించే రేడియేషన్ చికిత్స సాధ్యమవుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ట్రూబీమ్ సిస్టమ్ వల్ల తక్కువ సమయంలోనే రోగులకు నాణ్యమైన చికిత్స లభిస్తుందని, ఇది పేద ప్రజలకు వరంలా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

 

**క్యాన్సర్‌పై అధికారిక నిఘా..‘నోటిఫైబుల్ వ్యాధి’గా ప్రకటన**

 

రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సుమారు 55 వేల నుంచి 60 వేల కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, క్యాన్సర్‌ను ‘నోటిఫైబుల్ వ్యాధి’గా ప్రకటిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే ప్రతి క్యాన్సర్ కేసును అధికారికంగా రిజిస్టర్ చేసే విధానం అమల్లోకి వస్తుందని వివరించారు. ఈ క్యాన్సర్ రిజిస్ట్రీ ద్వారా లభించే ఖచ్చితమైన డేటాతో భవిష్యత్తులో మెరుగైన వైద్య ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

 

**మహిళా ఆరోగ్యానికి భరోసా..ఉచిత హెచ్‌పీవీ టీకాలు**

 

మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే నిమ్స్‌లో మహిళల కోసం ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించారు. అత్యంత కీలకమైన గర్భాశయ క్యాన్సర్ నివారణకు గాను, 14 నుంచి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా హెచ్‌పీవీ టీకాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ముందస్తు జాగ్రత్తలు భవిష్యత్తులో క్యాన్సర్ మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

**గ్రామీణ ప్రాంతాలకూ అత్యాధునిక వైద్యం**

 

వైద్య సేవలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, మారుమూల ప్రాంతాలకూ విస్తరిస్తున్నట్లు మంత్రి వివరించారు. ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా గ్రామీణ రోగులు చికిత్స కోసం దూరప్రాంతాలకు రావాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. పాలియేటివ్ కేర్ సేవలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విస్తరిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. క్యాన్సర్‌పై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ అంతిమ ధ్యేయమని దామోదర రాజనర్సింహ పునరుద్ఘాటించారు.