Mahaa Daily Exclusive

  పరిగి ‘భూ’పోరు.. ఉద్రిక్తత నడుమ హరీశ్‌రావు అరెస్టు..!

Share

  • అప్పా జంక్షన్ వద్ద టెన్షన్.. పోలీసుల అడ్డగింత.
  •  లారీలను అడ్డంపెట్టి కాన్వాయ్ నిలిపివేత.. కార్యకర్తల భారీ నిరసన.
  •  రేవంత్ పాలన రాక్షస పాలన.. ఇది గడీల రాజ్యం అంటూ హరీశ్ రావు ధ్వజం.
  •  శంషాబాద్ పీఎస్‌ వద్ద ఉత్కంఠ.. నోటిఫికేషన్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక.

హైదరాబాద్, మహా .

వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల భూములను సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ, బాధితులకు అండగా నిలిచేందుకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో పరిగికి బయల్దేరిన హరీశ్ రావు బృందాన్ని నార్సింగి అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, దివాకర్ రావు తదితరులతో కూడిన ఈ బృందాన్ని నిలువరించేందుకు పోలీసులు ఏకంగా రోడ్డుకు అడ్డంగా లారీలను నిలిపివేయడం గమనార్హం. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట, వాగ్వాదంతో అప్పా జంక్షన్ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం తలపించింది.

 

**పోలీసు నిర్బంధం..అప్పా జంక్షన్ వద్ద హైడ్రామా**

 

పరిగి రైతులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు లారీలను అడ్డంపెట్టి వాహనాలు ముందుకు కదలకుండా చేయడంతో కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ‘పోలీస్ గో బ్యాక్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ ఉత్కంఠ పర్వం చివరకు అరెస్టులతో ముగిసింది. హరీశ్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పోలీసులు గోప్యత పాటించడం, ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు తరలించడం ఉద్రిక్తతను మరింత పెంచింది. తమ నేతలను తరలిస్తున్న వాహనాలను బీఆర్‌ఎస్ శ్రేణులు వెంబడించడంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది.

 

**రేవంత్ పాలనపై హరీశ్ రావు నిప్పులు**

 

శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కన్నెర్ర చేశారు. రేవంత్ పాలనను ‘రాక్షస పాలన’, ‘గడీల పాలన’గా ఆయన అభివర్ణించారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి, నేడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. నిన్న సభలో అరెస్టులు చేయమని, తమది ప్రజాపాలన అని చెప్పిన 24 గంటలు కాకముందే ప్రజాప్రతినిధులను అక్రమంగా నిర్బంధించడం దారుణమని ధ్వజమెత్తారు. “రేవంత్ అంటేనే అయిపోయిన కథ.. ఆయనకు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పేదల ఇళ్లు కూల్చుతూ వికృతానందం పొందుతున్న రేవంత్ రెడ్డిని మించిన రావణాసురుడు మరొకరు ఉండరని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

 

**నోటిఫికేషన్ రద్దయ్యే వరకు ఆగని పోరాటం**

 

రెండు మూడు పంటలు పండే పచ్చటి భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో లాక్కోవడం తుగ్లక్ చర్య అని హరీశ్ రావు విమర్శించారు. రైతులు తమ భూములను ఇవ్వమని మొత్తుకుంటున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అక్రమంగా ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో తమ పోరాటాన్ని అణచివేయలేరని, బాజాప్త రైతుల వద్దకు వెళ్లి వారికి బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ గారి రామరాజ్యం మళ్ళీ రావడం ఖాయమని, అప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హరీశ్ రావు హెచ్చరించారు.

Latest