Mahaa Daily Exclusive

  గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రహదారి..! రైతులకు హైకోర్టు లో ఉపశమనం .

Share

  • గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రహదారి
  • రైతులకు హైకోర్టు లో ఉపశమనం
  • రైతులను ఖాళీ చేయించొద్దని హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్, మహా: రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ విషయంలో రైతులకు హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఆమన్‌గల్‌ ప్రాంతంలో మీర్‌ఖాన్‌పేట ఔటర్‌ రింగు రోడ్‌ నుంచి రీజినల్‌ రింగు రోడ్‌ వరకు చేపట్టనున్న పనుల కోసం భూములు స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అవార్డు ప్రకటించే దశ వచ్చే వరకు భూ యజమానులను ఖాళీ చేయించొద్దని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించిన 30 మంది రైతులకు చెందిన 61 ఎకరాల భూమికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. యాచారం, కడ్తాల్‌, ఆమన్‌గల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో మొత్తం 554.34 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ అన్నేపు జంగయ్యతోపాటు మరికొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది భూసేకరణ చట్ట ప్రక్రియలను పాటించలేదనీ, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు. భూయజమానులకు అభ్యంతరాలు చెప్పే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు.

 

ప్రభుత్వ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం భూసేకరణలో కొంత భాగంపైనే వివాదం ఉందనీ, కొంత భూమికి ఇప్పటికే పరిహారం చెల్లించినట్టు వివరించారు. పరిహారం చెల్లించిన తర్వాతే స్వాధీనం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ వాదనలు పరిశీలించిన జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌కుమార్‌ పరిహారం చెల్లించే వరకు భూముల నుంచి రైతులను పంపకూడదని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు సమర్పించాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను జూన్‌ ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు.