- పెండింగ్ చలాన్ల కోసం వాహనదారుల వేధింపులు చట్టవిరుద్ధం.
- తాళాలు లాక్కోవడం, బలవంతపు వసూళ్లు నేరం.
- పోలీసులకు న్యాయస్థానం మొట్టికాయలు.
- నిబంధనల అతిక్రమణపై చర్యలు తీసుకోవాలే తప్ప
- ‘వసూళ్ల ఏజెంట్లు’గా మారొద్దని హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల వేటపై హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వాహనదారులను నడిరోడ్డుపై ఆపి, వారిని ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ, పాత బాకీల కోసం వాహనదారులను గంటల తరబడి నిలిపివేయడం లేదా వారి వాహనాల తాళాలు లాక్కోవడం వంటి చర్యలు ఏ చట్టం కల్పించిన అధికారం కాదని ధ్వజమెత్తెంది. పోలీసుల పని నిబంధనలను పర్యవేక్షించడమే తప్ప, రికవరీ ఏజెంట్ల మాదిరిగా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, పోలీసుల అతి ఉత్సాహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
**తాళాలు లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధం**
వాహనదారులను ఆపి వారి వాహనాల నుంచి బలవంతంగా తాళాలు లాక్కోవడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం తనిఖీల సమయంలో పత్రాలను అడిగే హక్కు పోలీసులకు ఉందని, అయితే పెండింగ్ చలాన్లు కట్టే వరకు వాహనాన్ని కదలనివ్వబోమని భీష్మించడం అక్రమ నిర్బంధం కిందకే వస్తుందని తేల్చిచెప్పింది. పోలీసుల విధుల్లో భాగంగా చలాన్ జారీ చేయడం వరకు మాత్రమే వారికి అధికారం ఉంటుందని, ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయని గుర్తు చేసింది. నడిరోడ్డుపై వాహనదారులను అవమానపరుస్తూ, వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ చేసే వసూళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
**చట్టబద్ధమైన రికవరీ మార్గాలు అనుసరించాలి**
పెండింగ్ చలాన్ల రికవరీ కోసం పోలీసులు అనుసరించాల్సిన విధానాలపై కూడా హైకోర్టు స్పష్టతనిచ్చింది. బకాయిలు ఉన్న వాహనదారులకు నోటీసులు పంపడం, లేదా న్యాయస్థానాల ద్వారా సమన్లు జారీ చేయడం వంటి పద్ధతులను పాటించాలని సూచించింది. చలాన్లను సకాలంలో చెల్లించకపోతే అట్టి వాహనాలపై ఉన్న సమాచారాన్ని రవాణా శాఖకు సమర్పించి, ఆ వాహనాల రిజిస్ట్రేషన్ బదిలీ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి సేవలను నిలిపివేసే అవకాశం ఉందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలే తప్ప వీధుల్లో దౌర్జన్యంగా వసూళ్లు చేయకూడదని ఆదేశించింది. చలాన్ల వసూళ్ల పేరుతో సామాన్యులను వేధిస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
**వాహనదారులకు ఊరట..పోలీసులకు మార్గదర్శకం**
కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల టార్గెట్లను రీచ్ అవ్వడానికి సామాన్యులను బలిపశువులను చేస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా హైకోర్టు జోక్యంతో ఈ పద్ధతికి చరమగీతం పాడినట్లయింది. నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలే తప్ప, వారిలో పోలీసుల పట్ల భయాందోళనలు సృష్టించకూడదని న్యాయస్థానం హితవు పలికింది. ఈ తీర్పు నేపథ్యంలో ఇకపై పోలీసులు వాహనదారులను పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే వాహనదారులు ఉన్నతాధికారులకు లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు కలిగింది.








