Mahaa Daily Exclusive

  పచ్చ బంగారానికి ‘గ్రహణం’.. పడిపోతున్న పసుపు ధరలు.. పట్టించుకోని బోర్డు.!

Share

  •  యుద్ధ మేఘాల నీడలో ఎగుమతులు స్తంభన.
  •  పెట్టుబడి కూడా రాని పరిస్థితిపై అన్నదాతల ఆవేదన.. దళారుల సిండికేట్‌తో బలి.
  •  నిజామాబాద్‌ మార్కెట్‌లో నేలచూపులు చూస్తున్న రేట్లు.. 9 నెలల శ్రమ వృథా!

నిజామాబాద్, మహా.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ‘పచ్చ బంగారం’గా పేరొందిన పసుపు పంట ఈ ఏడాది కన్నీళ్లు మిగిలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఎగుమతులపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు మరియు హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు విదేశీ ఎగుమతులను స్తంభింపజేశాయి. దీనిని సాకుగా చూపి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను దారుణంగా తగ్గిస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.15,300 పలికిన పసుపు ధర, ప్రస్తుతం రూ.9,000 నుంచి రూ.11,000 లోపుకే పడిపోవడం అన్నదాతలను దిగాలుగా చేస్తోంది. 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

 

**పెట్టుబడి ‘లక్ష’.. రాబడి ‘సగం’**

 

పసుపు సాగుకు ఎకరాకు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. దుక్కి దున్నడం నుంచి కోత కోసి కల్లానికి చేర్చే వరకు కూలీల ఖర్చులు, ఎరువుల ధరలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు అకాల వర్షాలు, దుంప కుళ్లు తెగుళ్ల వల్ల దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం క్వింటాకు రూ.15 వేల ధర పలికితేనే రైతు గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో వస్తున్న ధరలు రైతు పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేలకు మించి రాబడి రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. జగిత్యాల, నిర్మల్ వంటి ఇతర జిల్లాల నుంచి వస్తున్న వేలాది బస్తాల పసుపునకు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

**పసుపు బోర్డు.. పేరుకేనా?**

 

దశాబ్దాల పోరాట ఫలితంగా నిజామాబాద్‌లో ఏర్పాటైన ‘జాతీయ పసుపు బోర్డు’ రైతులకు ఎటువంటి ఊరటనివ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఆర్భాటంగా ప్రారంభమైన ఈ బోర్డు, నేటికీ అద్దె భవనంలోనే కొనసాగుతుండటం గమనార్హం. బోర్డులో సరిపడా శాస్త్రవేత్తలు, సిబ్బంది లేకపోవడంతో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందడం లేదు. ముఖ్యంగా ధరలు పడిపోతున్న సమయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో బోర్డు పూర్తిగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఎగుమతులపై యుద్ధ ప్రభావం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను బోర్డు విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.