Mahaa Daily Exclusive

  అగరువత్తుల సుగంధం వెనుక ‘మోసపు’ దుర్గంధం..

Share

  • రాజమండ్రిలో రూ.25 కోట్ల భారీ కుంభకోణం!
  •  స్వయం ఉపాధి పేరిట 3 వేల మంది మహిళలకు వల.
  •  ‘సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌’ ఘరానా మోసం.
  •  లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.12,500 ఎర.
  •  నాలుగు నెలలుగా చెల్లింపులు బంద్‌ కావడంతో బట్టబయలు.
  •  గోదావరి జిల్లాల్లో గగ్గోలు పెడుతున్న బాధితులు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల వెల్లువ.

 

రాజమండ్రి, మహా.

 

సుగంధాన్ని వెదజల్లే అగరువత్తుల వ్యాపారం ముసుగులో రాజమండ్రి కేంద్రంగా ఒక భారీ ఆర్థిక విధ్వంసం చోటుచేసుకుంది. ‘ఇళ్ల వద్దే ఉండి లక్షలు సంపాదించుకోవచ్చు’ అంటూ సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ చేసిన మాయాజాలం నమ్మి సుమారు 3000 మంది మహిళలు నిలువునా మునిగిపోయారు. కేవలం తూర్పు గోదావరి జిల్లాలోనే కాకుండా పరిసర జిల్లాల్లోని మధ్యతరగతి, పేద కుటుంబాల మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ సుమారు రూ.25 కోట్ల వరకు వసూలు చేసి చేతులెత్తేసింది. నాలుగు నెలలుగా ఆశించిన నగదు రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు మంగళవారం రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దైవకార్యాలకు వాడే అగరువత్తుల పేరుతో ఇంత పెద్ద ఎత్తున మోసం జరగడం స్థానికంగా పెను కలకలం రేపుతోంది.

 

**ఆశ చూపారు.. అప్పుల పాలు చేశారు**

 

సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకులు మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ అత్యంత ఆకర్షణీయమైన స్కీమ్‌ను ప్రకటించారు. తమ సంస్థ ద్వారా ముడి సరుకు అందజేస్తామని, వాటితో ఇళ్ల వద్దే అగరువత్తులు తయారు చేస్తే తిరిగి తామే కొనుగోలు చేస్తామని నమ్మబలికారు. అయితే, ఇందుకోసం ప్రతి మహిళా తొలుత రూ.లక్ష రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని నిబంధన విధించారు. అలా లక్ష రూపాయలు కడితే, ప్రతి నెలా పనితనానికి ప్రతిఫలంగా రూ.12,500 చొప్పున చెల్లిస్తామని ఎర వేశారు. అంటే ఏడాదికి పైగా పని చేస్తే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా, అదనపు ఆదాయం లభిస్తుందనే ఆశతో వేలాది మంది మహిళలు అప్పులు చేసి, బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ఈ స్కీమ్‌లో చేరారు.

 

**మొదట్లో మురిపించి.. చివరలో ముంచేసి**

 

సంస్థ ప్రారంభంలో కొందరికి సక్రమంగానే చెల్లింపులు చేస్తూ నమ్మకాన్ని కలిగించింది. దీంతో ఒకరిని చూసి ఒకరు చొప్పున వేలాది మంది మహిళలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. కానీ, గత నాలుగు నెలలుగా పరిస్థితి తలకిందులైంది. తయారీ చేసిన అగరువత్తులను తీసుకుంటున్నా, రావాల్సిన నగదును మాత్రం నిర్వాహకులు వాయిదా వేస్తూ వచ్చారు. ఫోన్లు చేసినా, కార్యాలయానికి వెళ్లినా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. చివరకు నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన మహిళలు పెద్ద ఎత్తున రాజమండ్రి పోలీసులను ఆశ్రయించారు. బాధితులంతా కన్నీరుమున్నీరు అవుతూ తమకు న్యాయం చేయాలని, తమ కష్టార్జితాన్ని వెనక్కి ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు.

 

**పోలీసుల దర్యాప్తు – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక**

 

బాధితుల ఫిర్యాదు మేరకు రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు రూ.25 కోట్ల మేర నగదు మళ్లింపు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్‌ వెనుక ఉన్న సూత్రధారులెవరు? సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌కు అనుమతులు ఉన్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. స్వయం ఉపాధి పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే సంస్థల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి ఆకర్షణీయమైన స్కీమ్‌ల వెనుక పెద్ద కుట్రలు ఉంటాయని, ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Latest