Mahaa Daily Exclusive

  సిడ్నీలో వార్నర్‌ ‘మద్యం’ పాచిక..! డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో స్టార్‌ క్రికెటర్‌ అరెస్టు..

Share

  •  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో స్టార్‌ క్రికెటర్‌ అరెస్టు!
  •  తనిఖీ కేంద్రానికి ముందే కారు నిలిపివేత.
  •  పోలీసుల కంటబడటంతో బట్టబయలు.

 

సిడ్నీ, మహా.

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం, విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ తన క్రమశిక్షణారాహిత్యంతో మరోసారి వార్తల్లో నిలిచారు. సిడ్నీ వీధుల్లో మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో వార్నర్‌ను పోలీసులు అరెస్టు చేసి, అతడిపై మధ్యశ్రేణి నేరంగా కేసు నమోదు చేయడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ 39 ఏళ్ల వెటరన్‌ ఆటగాడు, ప్రస్తుతం వివిధ దేశాల్లోని టీ20 లీగ్‌ల్లో బిజీగా గడుపుతూ ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.

చాకచక్యంగా తప్పించుకోవాలని చూసినా..

సిడ్నీలోని మారౌబ్రా ప్రాంతంలో ఈస్టర్ ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మలాబార్ రోడ్డుపై పోలీసులు ‘ర్యాండమ్ బ్రీత్ టెస్ట్’ నిర్వహిస్తున్నట్లు గమనించిన వార్నర్, తన వాహనాన్ని తనిఖీ కేంద్రానికి కొంత దూరంలోనే రోడ్డు పక్కన నిలిపివేశారు. పోలీసుల కన్నుగప్పి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన కారు ఆపేసినట్లు పోలీసులు అనుమానించారు. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వార్నర్‌ను ప్రశ్నించి, బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో ఆయన మద్యం సేవించినట్లు ప్రాథమికంగా తేలడంతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని మారౌబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ద్వితీయ శ్రేణి పరీక్షల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం వాహనం నడిపే వ్యక్తికి ఉండాల్సిన గరిష్ట పరిమితి (0.05) కంటే ఇది రెట్టింపు కన్నా ఎక్కువే. దీనిని ‘మిడ్-రేంజ్ పీసీఏ’ నేరంగా పరిగణిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడికి కోర్టు హాజరు నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. వచ్చే నెల, అనగా మే 7న సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో వార్నర్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నేరం రుజువైతే ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు భారీ జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

 

వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలో కరాచీ జట్టు వరుసగా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో చిన్న విరామం దొరకడంతో తన కుటుంబంతో సమయం గడపడానికి వార్నర్ సిడ్నీకి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ వివాదం చోటుచేసుకోవడం కరాచీ కింగ్స్ యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 9న పెషావర్ జల్మీతో జరగబోయే కీలక మ్యాచ్‌కు వార్నర్ అందుబాటులో ఉంటారా లేదా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. వివాదాలకు మారుపేరైన వార్నర్ కెరీర్‌లో ఇది మరో మాయని మచ్చగా మిగిలిపోనుంది.