Mahaa Daily Exclusive

  ఉపాధి హామీపై కేంద్రం ‘కక్ష’..! తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత..

Share

  • పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్‌ పన్నాగం.
  • పని దినాలు సగానికి తగ్గింపు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై గొడ్డలి పెట్టు.
  • నోరు మెదపని రాష్ట్ర బీజేపీ ఎంపీలు.. కేంద్రంతో కొట్లాడి నిధులు తేవాలి.
  •  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

 

హైదరాబాద్, మహా.

 

గ్రామీణ పేదల పాలిట కల్పవృక్షంలా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల పట్ల కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోందని, వారి నోటికాడి కూడును లాగేసుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకు జరుగుతున్న కుట్రలను ఎండగట్టారు. చట్టబద్ధత కలిగిన ఈ పథకాన్ని కేవలం ఒక ‘ప్రోగ్రామ్’గా మార్చేసి, భవిష్యత్తులో దాన్ని పూర్తిగా రద్దు చేసినా అడిగే వారు లేకుండా చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోందని ఆమె మండిపడ్డారు.

 

**పని దినాల కోత.. పేదల పొట్టపై దెబ్బ**

 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్న ఉపాధి హామీ పథకంలో పని దినాలను కేంద్రం భారీగా తగ్గించడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ అనంతరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 కోట్ల పని దినాలు ఉండగా, గతేడాది వాటిని కేవలం 7 కోట్లకు తగ్గించారని ఆమె గణాంకాలతో సహా వివరించారు. అంటే సగానికి సగం పని దినాలను కుదించడం ద్వారా లక్షలాది మంది కూలీల ఉపాధిని కేంద్రం దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. కరువు కాలంలో గ్రామాల్లో పేదలను ఆదుకున్న ఈ పథకానికి నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి కార్మిక చట్టాలను వర్తింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 

**బీజేపీ ఎంపీల మౌనం…అప్రజాస్వామికం**

 

రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే, వారు కేంద్రం వద్ద తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని కవిత విమర్శించారు. పేద ప్రజల హక్కులను కాలరాస్తుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అన్యాయమని, ఇది వారి అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. తక్షణమే తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణకు రావాల్సిన ఉపాధి హామీ నిధులను తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం రాజకీయం కోసం కాకుండా, పేదల కడుపు నింపే ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. చట్టబద్ధమైన నిధుల కోసం మోదీ సర్కార్‌తో కొట్లాడాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.