- మావోయిస్టు రహితంగా తెలంగాణ.
- కర్రెగుట్టల్లో కొత్త చరిత్ర.. బాహ్య ప్రపంచంతో అనుసంధానమే లక్ష్యం.
- డీజీపీ శివధర్ రెడ్డి.
- పామునూరులో పోలీస్ అవుట్‌పోస్ట్‌కు భూమిపూజ.
- రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ పిలుపు.
ములుగు,మహా:
తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు విముక్త ప్రాంతంగా మారిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. ఒకప్పుడు అశాంతికి నిలయంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి కిరణాలు ప్రసరిస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అత్యంత వెనుకబడిన కర్రెగుట్టలు ప్రాంతంలో మంగళవారం పర్యటించిన ఆయన, అక్కడ జరుగుతున్న మార్పులను స్వయంగా వీక్షించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గూడాలను బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.
ఏ ప్రాంతమైనా బాగుండాలంటే రోడ్డు సౌకర్యం ప్రాణవాయువు వంటిదని, అందుకే కర్రెగుట్టలు వంటి మారుమూల ప్రాంతాలను మిగతా ప్రపంచంతో కలిపేందుకు రహదారుల నిర్మాణం చేపట్టామని డీజీపీ వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండటం వల్ల గతంలో ఇక్కడ కనీస సౌకర్యాలైన రోడ్లు, వీధి దీపాలు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావం అంతరించడంతో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని, ఇప్పటికే 13 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి కావడం శుభపరిణామమని తెలిపారు. ఈ రహదారుల వల్ల రవాణా సౌకర్యమే కాకుండా, మున్ముందు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా మార్గం సుగమమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని, భద్రతతో కూడిన అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
పర్యటనలో భాగంగా పామునూరులో ఏర్పాటు చేయనున్న పోలీస్ అవుట్ పోస్ట్‌కు, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్‌కు డీజీపీ శివధర్ రెడ్డి భూమిపూజ మరియు శంకుస్థాపన చేశారు. కేవలం రక్షణ కల్పించడమే కాకుండా, ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పామునూరు గ్రామస్థులకు బియ్యం, నిత్యావసర వస్తువులు, సోలార్ లాంతర్లను ఆయన పంపిణీ చేశారు. ఇంకా అడవి బాటలో ఉండి ఉద్యమం చేస్తున్న ఆరుగురు వ్యక్తులు కూడా తక్షణమే జనజీవన స్రవంతిలోకి రావాలని, శాంతియుత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో పాల్గొన్న ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ మాట్లాడుతూ, అటవీ చట్టాలను ఏమాత్రం ఉల్లంఘించకుండా పర్యావరణ హితంగా ఈ రోడ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. గతంలో తాడ్వాయి వరకే పరిమితమైన ఎకో టూరిజాన్ని ఇప్పుడు దట్టమైన అడవుల్లోకి కూడా విస్తరించే అవకాశం ఏర్పడిందని, ములుగు జిల్లాలోని జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు.
అనంతరం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’రోడ్డు భద్రతా కార్యక్రమంలో డీజీపీ పాల్గొని వాహనదారులకు హితవు పలికారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రాణ రక్షణ కూడా అంతే ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. అజాగ్రత్తతో వాహనాలు నడిపి నిండు ప్రాణాలను బలి తీసుకోవద్దని, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకపోవడం వంటి ప్రాథమిక సూత్రాలను తప్పక పాటించాలని కోరారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి కర్తవ్యమని ఆయన గుర్తు చేశారు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం ద్వారా సామాజిక అభివృద్ధిని, అవగాహన సదస్సుల ద్వారా ప్రాణ రక్షణను రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.








