Mahaa Daily Exclusive

  ఆడిటింగ్‌లో ‘తెలంగాణ’ హ్యాట్రిక్.. దేశానికే దిక్సూచిగా మన ఆన్లైన్ వ్యవస్థ..!

Share

  •  వరుసగా మూడోసారి జాతీయ స్థాయిలో అగ్రస్థానం..  రాష్ట్ర ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం.
  •  అధ్యయనం కోసం సచివాలయానికి తరలివచ్చిన గుజరాత్ ఉన్నతాధికారుల బృందం.
  •  తెలంగాణ మోడల్ పాలనే మేలుబంతి.
  •  ఇతర రాష్ట్రాలకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం.

హైదరాబాద్, మహా.

 

పాలనలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన తెలంగాణ ఆడిట్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో సగర్వంగా తల ఎత్తుకుంది. ఆన్లైన్ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ, వరుసగా మూడోసారి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పారదర్శకమైన ఆడిటింగ్ విధానాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఈ అద్భుత ప్రగతి ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నిధుల వినియోగంలో అడుగడుగునా నిఘా ఉంచుతూ, అవకతవకలకు తావులేకుండా ఆన్లైన్ వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా తెలంగాణ ఆడిట్ శాఖ ఈ ఘనతను సాధించింది.

తెలంగాణలో అమలవుతున్న ఈ వినూత్న ఆడిటింగ్ విధానాలను, ఇక్కడి ఆన్లైన్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారుల బృందాలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గుజరాత్ రాష్ట్ర ఆడిట్ శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్‌లోని సచివాలయాన్ని సందర్శించింది. తెలంగాణ ఆడిట్ శాఖ చేపట్టిన సంస్కరణలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం, క్షేత్రస్థాయిలో ఆడిటింగ్ ప్రక్రియ సాగుతున్న తీరును వారు ఆసక్తిగా గమనించారు. ఇక్కడి ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను వారు పరిశీలించారు. తెలంగాణ మోడల్ పాలన దేశానికే ఆదర్శంగా నిలవడంపై గుజరాత్ బృందం ప్రశంసలు కురిపించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందిస్తూ.. తెలంగాణ ఆడిట్ శాఖ సాధించిన ఈ హ్యాట్రిక్ విజయం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొంది. సమర్థవంతమైన పాలన, అవినీతి రహిత వ్యవస్థను నిర్మించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఒక నిదర్శనమని అభివర్ణించింది. తెలంగాణలో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాలకు వివరించేందుకు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు వచ్చే బృందాలకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. డిజిటల్ విప్లవం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో తీసుకువచ్చిన ఈ మార్పులు భవిష్యత్తులో మరింత పటిష్టమైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.