హైదరాబాద్, మహా.
దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో పహారా కాసే సైనికులే కాకుండా, కంటికి కనిపించకుండా శత్రువుల కుట్రలను ఛేదించే గూఢచారులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘ధురంధర్-2’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత కోసం తమ వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను త్యాగం చేస్తూ అహర్నిశలూ శ్రమిస్తున్న గూఢచారుల నిజ జీవిత పోరాటాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించిందని ఆయన ప్రశంసించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో భారత గూఢచారులు మారువేషాల్లో ఉంటూ, శత్రుదేశాల దుష్ట పన్నాగాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ దేశ సమగ్రతను కాపాడుతున్న తీరు గర్వకారణమని రామచందర్ రావు పేర్కొన్నారు. ఈ చిత్రం కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రతి పౌరుడిలో దేశ రక్షణ పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ఈ చిత్రంలో అత్యంత హేతుబద్ధంగా వివరించారని ఆయన తెలిపారు. పాకిస్తాన్ నుంచి భారీగా నకిలీ నోట్లను తరలించి భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని చూసిన శత్రువుల కుట్రలను ఆ నిర్ణయం ఎలా అడ్డుకుందో సినిమాలో స్పష్టంగా చూపారన్నారు. అలాగే చిన్నారులను పావులుగా వాడుకుంటూ దేశంలో అశాంతిని, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిజాయితీగా తెరకెక్కించిన చిత్ర బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
నగరంలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాన్ని ముఖ్యంగా కళాశాల యువత తప్పకుండా చూడాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. యువతలో దేశం పట్ల అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తన పెరగడానికి ఇటువంటి చిత్రాలు ఎంతో దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు.








