Mahaa Daily Exclusive

  అక్రమ సంపాదనతో ‘యూట్యూబ్’ ప్రచారాలు.. బీఆర్‌ఎస్‌పై మంత్రి జూపల్లి ఆగ్రహం..

Share

  • ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా 200 ఛానెళ్ల కొనుగోలు.
  •  సోషల్ మీడియా ప్రచారాన్ని కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలి.

హైదరాబాద్, మహా.

గత పదేళ్ల పాలనలో అక్రమంగా గడించిన వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ ఏకంగా 200 యూట్యూబ్ ఛానెళ్లను కొనుగోలు చేసిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు.

**దుష్ప్రచారమే లక్ష్యంగా పెట్టుబడులు**

అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్‌ఎస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోందని, అందుకే సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ప్రభుత్వంపై బురదజల్లుతోందని మంత్రి విమర్శించారు. కేవలం అబద్ధాలను ప్రచారం చేయడానికి, లేనివి ఉన్నట్లు సృష్టించడానికి భారీ ఎత్తున నిధులు వెచ్చించి యూట్యూబ్ ఛానెళ్లను మేనేజ్ చేస్తోందని దుయ్యబట్టారు. వేల కోట్ల అక్రమ సొమ్ముతో నడుస్తున్న ఈ ‘ప్రచార దందాను’ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి కానీ, ఇలా వ్యవస్థలను కొనుగోలు చేసి దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

**ఫీల్డ్‌లోకి వెళ్లకపోతే ఫలితం ఉండదు**

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ.. కేవలం ఇళ్లలో కూర్చుని ఆలోచిస్తే అధికారం దక్కదని, రాజకీయాల్లో కష్టపడితేనే గుర్తింపు ఉంటుందని మంత్రి హితవు పలికారు. “మంత్రాలకు చింతకాయలు రాలవు.. అనే నిజాన్ని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకం కావాలి” అని సూచించారు. బీఆర్‌ఎస్ చేస్తున్న సోషల్ మీడియా దాడులను తిప్పికొడుతూనే, మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య యుద్ధంలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని స్పష్టం చేశారు.

**రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం**

వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నదే తమ ఏకైక లక్ష్యమని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ మహత్కార్యం కోసం ఇప్పటి నుంచే పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలని సూచించారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త రోజుకు కనీసం ఒక గంట సమయాన్ని పార్టీ కోసం, ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో పనిచేసి 2029లో కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే కాకుండా, రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు.