Mahaa Daily Exclusive

  నేలతల్లి క్షేమమే లక్ష్యం..  30 వేల మంది ‘సాయిల్‌ హెల్త్‌’ వాలంటీర్లకు శిక్షణ..

Share

  • 30 వేల మంది ‘సాయిల్‌ హెల్త్‌’ వాలంటీర్లకు శిక్షణ.
  • రైతు నేస్తం వేదికగా అన్నదాతలతో ముఖాముఖి.
  • యూరియా యాప్‌ పనితీరుపై మంత్రి తుమ్మల హర్షం.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో సాగు భూముల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది యువ రైతులకు ‘సాయిల్‌ హెల్త్‌’ (భూసార) వాలంటీర్లుగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం సచివాలయం నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అన్నదాతలతో నేరుగా ముచ్చటించారు. ప్రతి గ్రామంలో కనీసం ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించామని, భూసార పరీక్షల ఫలితాలను రైతులకు సులభంగా వివరించడం వీరి ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

రసాయన ఎరువుల విచక్షణారహిత వాడకం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో, నేల స్వభావానికి అనుగుణంగా ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పించడమే ఈ వాలంటీర్ల లక్ష్యమని మంత్రి వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో రోజుకు వెయ్యి మందికి చొప్పున నెల రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయని తెలిపారు. భూసార పరీక్షా కేంద్రాలు, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ల సేవలను మరింత వేగవంతం చేస్తున్నామని, రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించి సాగు వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూరియా యాప్’ పనితీరుపై మంత్రి రైతులతో చర్చించగా, క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన స్పందన లభించింది. గతంలో యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు యాప్‌ ద్వారా బుక్ చేసుకుని తమకు వీలైన సమయంలో తెచ్చుకునే వెసులుబాటు కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ఎరువుల కొరత భయం కూడా తప్పిందని వారు మంత్రికి వివరించారు. ఈ స్పందనపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రైతాంగం ముందుండటం శుభపరిణామమని కొనియాడారు.

పంట మార్పిడి , అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని కోరుతూ, పామాయిల్ సాగు ప్రాధాన్యతను మంత్రి వివరించారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు అంతర పంటగా పామాయిల్ వేసుకోవచ్చని, దీనివల్ల రైతులకు స్థిరమైన మరియు అధిక ఆదాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రిని కలిసి తమ ప్రాంత సమస్యలను విన్నవించారు. హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డు పనులను నిలిపివేయాలని కోరగా, సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.