- జలమండలి ఎండీ కీలక ఆదేశాలు.
- ఇక రాత్రి వేళల్లోనూ ట్యాంకర్ల సరఫరా.
- నీటిని వృధా చేసినా, మోటార్లు పెట్టి తోడినా కఠిన చర్యలు.
హైదరాబాద్, మహా.
గ్రీష్మ తాపం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భాగ్యనగరవాసుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి పటిష్టమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాబోయే 60 రోజుల పాటు నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌మిషన్, ఓఅండ్ఎమ్ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్షలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, జలాశయాల్లో నిల్వలు, పంపింగ్ సామర్థ్యంపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.
నగరంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా నీరు అందేలా చూడటమే ప్రస్తుత లక్ష్యమని ఎండీ పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలకు అదనంగా అందుతున్న నీటిని నియంత్రించి, తక్కువగా సరఫరా అవుతున్న ప్రాంతాలకు మళ్లించడం ద్వారా సమతుల్యత పాటించాలని ట్రాన్స్ మిషన్ అధికారులకు సూచించారు. అవసరమైన చోట్ల వాల్వ్ ఆపరేషన్లను పునఃసమీక్షించి, నీటి సరఫరా సమయాలను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు. నీటి సరఫరాలో సమయపాలన అత్యంత ముఖ్యం అని, ఒకవేళ అనివార్య కారణాల వల్ల సరఫరాలో అంతరాయం కలిగితే ఆ సమాచారాన్ని ముందుగానే ప్రజలకు చేరవేసి వారిని ఇబ్బందుల నుంచి తప్పించాలని హితవు పలికారు.
వేసవి డిమాండ్‌ను తట్టుకునేందుకు ట్యాంకర్ల వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టారు. నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1250 ట్యాంకర్లు, 90 ఫిల్లింగ్ స్టేషన్లను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని, అవసరమైతే మరిన్ని ఫిల్లింగ్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ముఖ్యంగా ఇక నుంచి రాత్రి సమయాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఎండీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, రాత్రి వేళల్లో వాణిజ్య అవసరాలకు ట్యాంకర్లను పంపిణీ చేసేలా షెడ్యూల్ రూపొందించాలని వివరించారు. దీనివల్ల పగటిపూట రద్దీ తగ్గుతుందని, సామాన్య ప్రజలకు త్వరగా నీరు అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నీటి వృధాను అరికట్టే విషయంలో జలమండలి ఇకపై కఠినంగా వ్యవహరించనుంది. తాగునీటిని వాహనాలు కడగడానికి, ప్రాంగణాలను శుభ్రం చేయడానికి వాడితే భారీ జరిమానాలు తప్పవని ఎండీ హెచ్చరించారు. అలాగే నీటి సరఫరా సమయాల్లో మోటార్లు పెట్టి నీటిని తోడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మోటార్లను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. లీకేజీలు, అనధికార కనెక్షన్ల నియంత్రణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఈడీ సామ్రాట్ అశోక్, ఆపరేషన్ డైరెక్టర్ నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







