- ఘనాపూర్ ఆనకట్టకు 12 రోజుల పాటు నీటి విడుదల..
- సింగూర్ నుంచి 0.30 టీఎంసీలు వదలాలని సీఎస్‌కు ఆదేశం.
హైదరాబాద్, మహా.
సాగునీరు అందక ఎండుతున్న పంటలను కాపాడటమే కాకుండా, అన్నదాతల జీవనోపాధిని రక్షించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా ఘనాపూర్ ఆనకట్ట పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల్లో సాగులో ఉన్న వరి పంటకు సాగునీరు విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై మంగళవారం జరిగిన విచారణలో డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఉన్న కమిషన్ అత్యంత కీలకమైన మధ్యంతర ఆదేశాలను వెలువరించింది. పంట ప్రస్తుతం చేతికి వచ్చే కీలక దశలో ఉన్నందున, ఈ సమయంలో నీటి కొరత ఏర్పడితే రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని, అది వారి ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి విఘాతమని కమిషన్ అభిప్రాయపడింది.
రైతులకు సాగునీరు అందించకపోవడం అనేది కేవలం పరిపాలనాపరమైన వైఫల్యం మాత్రమే కాదని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా కల్పించబడిన జీవించే హక్కును ఉల్లంఘించడమేనని కమిషన్ తన ఆదేశాల్లో ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న వేలాది మంది రైతుల జీవనోపాధి, గౌరవప్రదమైన జీవనం మరియు ఆహార భద్రత వంటి ప్రాథమిక అంశాలు సాగునీటితో ముడిపడి ఉన్నాయని, వాటికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కమిషన్ సిఫారసు చేసింది.
రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, సింగూర్ ప్రాజెక్టు నుంచి వనదుర్గ ప్రాజెక్టు (ఘనాపూర్ ఆనకట్ట)కు తక్షణమే 0.30 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కమిషన్ ఆదేశించింది. ఈ నీటి విడుదలను రాబోయే 12 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగించాలని, తద్వారా ఎండుతున్న పంటలకు ప్రాణవాయువు అందించాలని సూచించింది. పంటలను కాపాడటం ద్వారా వేలాది రైతు కుటుంబాలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించవచ్చని కమిషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సంచలన ఉత్తర్వులతో సంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టు రైతాంగంలో కొత్త ఆశలు చిగురించగా, కమిషన్ ఆదేశాల అమలుపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.







