Mahaa Daily Exclusive

  ఐటీ కారిడార్‌లో ‘హైడ్రా’ సంచలనం. రూ.1200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం.

Share

  • ఖానామెట్‌లో బడా బిల్డర్ల ఆక్రమణలపై ఉక్కుపాదం.
  •  8 ఎకరాలకు పైగా భూమి విముక్తి.

హైదరాబాద్, మహా.

భాగ్యనగర ఐటీ హబ్‌కు గుండెకాయ వంటి శేరిలింగంపల్లి మండలంలో హైడ్రా మరో భారీ ఆపరేషన్‌ నిర్వహించి సంచలనం సృష్టించింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన ఈ మెరుపు దాడిలో సుమారు 8 ఎకరాలకు పైగా భూమిని బడా రియల్ ఎస్టేట్ సంస్థల చెర నుంచి విడిపించింది. మంగళవారం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 55లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ. 1200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటీ కారిడార్‌కు అత్యంత చేరువలో ఉన్న ఈ భూమిపై గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ దిగ్గజాల కన్ను పడటంతో, పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఖానామెట్‌లోని సర్వే నంబర్ 55లో ఉన్న 4.20 ఎకరాల భూమిని మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ తమదిగా చెప్పుకుంటూ వస్తోంది. ఈ భూమిలో వాసవి నిర్మాణ సంస్థ తన భవన నిర్మాణ అవసరాల కోసం భారీ ఆర్‌సీసీ ప్లాంట్లతో పాటు కార్మికుల కోసం తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి నిర్మాణ సామగ్రిని నిల్వ ఉంచింది. ఇదే సర్వే నంబర్‌లోని మరో 4 ఎకరాల భూమిని కొలను మాధవరెడ్డి కుమార్తె కొలను సబిత తన స్వాధీనంలో ఉంచుకుని, అక్కడ ఇతరులెవరూ రాకుండా బౌన్సర్లను కాపలాగా ఉంచారు. అయితే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఈ భూమిని అసైన్డ్ ల్యాండ్‌గా గుర్తించి ‘ప్రోహిబిటెడ్’ (నిషేధిత) జాబితాలో చేర్చారు. అంటే ఇది పూర్తిస్థాయిలో ప్రభుత్వానికే చెందుతుందని రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

బడా సంస్థలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాయని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో లోతైన విచారణ జరిపారు. రెవెన్యూ శాఖతో కలిసి జరిపిన ఈ సర్వేలో అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమేనని నిర్ధారణ కావడంతో మంగళవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన షెడ్డులను హైడ్రా సిబ్బంది కూల్చివేయగా, వాసవి నిర్మాణ సంస్థ తమ ఆర్‌సీసీ ప్లాంట్‌ను స్వయంగా తొలగించుకుంది. భూమి చుట్టూ కాపలాగా ఉన్న బౌన్సర్లను పంపించివేసి, మొత్తం 8 ఎకరాల సరిహద్దుల్లో హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

అనంతరం ఇది ప్రభుత్వ భూమి అని, ఇందులో అక్రమ ప్రవేశం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ భారీ బోర్డులను ఏర్పాటు చేశారు. గతంలోనూ ఇదే ప్రాంతంలోని సర్వే నంబర్ 53లో ఉన్న మొండికుంట ఆక్రమణలతో పాటు సర్వే నంబర్ 55లో సుమారు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా చర్యతో ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ భూములను ఆక్రమించిన బడా బాబుల గుండెల్లో హైడ్రా మరోసారి వణుకు పుట్టించింది. విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.