Mahaa Daily Exclusive

  సామాజిక అసమానతలకు బ్రాహ్మణులే మూలం.. మందకృష్ణ మాదిగ ధ్వజం..

Share

  •  కుల వ్యవస్థను సృష్టించి మనుషుల మధ్య గోడలు కట్టారు.. ఆధిపత్య ధోరణి నశించాలి.
  • రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బ్రాహ్మణ సంఘాల ప్రతిసవాల్‌.
  •  మందకృష్ణ మాదిగ ధ్వజం.

హైదరాబాద్, మహా.

దేశంలో వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుల వివక్షకు, సామాజిక అసమానతలకు బ్రాహ్మణ సామాజిక వర్గమే మూలకారణమని ఎంఆర్‌పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బ్రాహ్మణులపై అత్యంత ఘాటు విమర్శలు చేశారు. భారతదేశంలో కుల వ్యవస్థను సృష్టించి, మనుషుల మధ్య విభజన గోడలు కట్టింది బ్రాహ్మణులేనని ఆయన ఆరోపించారు. రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ పాలన వరకు అన్ని కాలాల్లోనూ వారి ఆధిపత్యమే కొనసాగిందని, ఈ ఆధిపత్య ధోరణి కారణంగానే నాడు అణగారిన వర్గాలకు, బ్రాహ్మణేతర కులాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు.

సమాజంలో కేవలం ఎస్సీలు మాత్రమే కాకుండా, మిగతా అన్ని వర్ణాల వారు కూడా బ్రాహ్మణ ఆధిపత్యానికి బాధితులేనని మందకృష్ణ వ్యాఖ్యానించారు. మెజారిటీ ప్రజలను తక్కువ చేసి చూడటం ఆ వర్గం నైజమని ఆయన విమర్శించారు. మంత్రాలతో దేవుడినే శాసిస్తామనే అహంకారం బ్రాహ్మణుల్లో కనిపిస్తుందని, సాక్షాత్తూ దేవుడినే శాసించే శక్తి తమకు ఉందని భావించే వారికి సామాన్య ఎస్సీలు లేదా ఇతర కులాల వారు లోకువగా కనిపించడంలో ఆశ్చర్యం లేదని మండిపడ్డారు. బ్రాహ్మణులు సృష్టించిన ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా అన్ని వర్గాల వారు ఏకమై పోరాడాలని, సామాజిక సమానత్వం కోసం ఈ ఆధిపత్య భావజాలాన్ని అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మందకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. బ్రాహ్మణ సంఘం నేత ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ.. మందకృష్ణ విమర్శలను ఖండించారు. దేశంలో కుల వ్యవస్థతో పాటు రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రిజర్వేషన్లు రద్దు చేయడానికి సిద్ధపడితే మందకృష్ణ మాటలను తాము హర్షిస్తామని ఎద్దేవా చేశారు. నిజాయితీకి, నిబద్ధతకు బ్రాహ్మణులు కేరాఫ్ అడ్రస్ అని, సామాజిక సమతుల్యతను దెబ్బతీసే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. మందకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

Latest