Mahaa Daily Exclusive

  సమాచార యుద్ధంలో ఐఐఎస్ అధికారులే సైనికులు..ఢిల్లీలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ట్రైనీ అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ..

Share

  • జాతీయ సమగ్రతకు, ఐక్యతకు మీరే రక్షకులు.
  •  కుట్రలను తిప్పికొట్టడంలో కీలకంగా వ్యవహరించాలి.
  • ఢిల్లీలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ట్రైనీ అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ.

ఢిల్లీ, మహా.

 

దేశ భద్రతకు ముప్పు కలిగించేలా, సంక్షోభ సమయాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ గందరగోళం సృష్టించే శక్తుల కుట్రలను తిప్పికొట్టడంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఐఐఎస్ అధికారులు కేవలం ప్రభుత్వ సమాచారాన్ని చేరవేసే మాధ్యమకర్తలుగా మాత్రమే కాకుండా, సమాచార సమగ్రతకు మరియు జాతీయ ఐక్యతకు పరిరక్షకులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో తనను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఐఎస్ గ్రూప్-ఏ ట్రైనీ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో సమాచార వ్యాప్తి అనేది కేవలం ఒక పరిపాలనా సాధనం మాత్రమే కాదని, అది జాతీయ స్థిరత్వానికి మరియు ప్రజల విశ్వాసానికి మూలస్తంభమని బండి సంజయ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బలాన్ని ఉపయోగించి చేసే యుద్ధాల కంటే, మేధస్సును ఉపయోగించి చేసే సమాచార యుద్ధం నేడు అత్యంత శక్తివంతమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం చేయకుండానే శత్రువుల మనసులను ప్రభావితం చేయడంలో టీవీ, రేడియో సహా మీడియా మాధ్యమాల ద్వారా నిర్వహించే సైకలాజికల్ ఆపరేషన్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ క్రమంలో ఐఐఎస్ అధికారులు అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షించారు.

సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారమవుతున్న ఫేక్ సమాచారం నేడు దేశ భద్రతకు పెద్ద సవాలుగా మారిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని అధిగమిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ , సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అందించే ప్రత్యేక శిక్షణ అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతర్గత భద్రత, సంక్షోభం మరియు విపత్తు సమయాల్లో సమాచార నిర్వహణ ఎలా ఉండాలనే అంశంపై అధికారులు పట్టు సాధించాలని సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూనే, దేశం మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 2009, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన గ్రూప్-ఏ అధికారులు పాల్గొన్నారు. వీరంతా ఈ నెల 15 నుంచి 22 వరకు అంతర్గత భద్రత మరియు సైకలాజికల్ ఆపరేషన్స్‌పై ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, కేంద్ర హోంశాఖ మీడియా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ రాజ్ కుమార్, ఐఐఎస్ విభాగం కోర్స్ డైరెక్టర్ రష్మీ రోజా తుషార నాయర్ తదితరులు పాల్గొన్నారు. సమాచార సమగ్రతను కాపాడుతూ జాతీయ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమించాలని అధికారులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు.