Mahaa Daily Exclusive

  అవినీతిపై ‘నిఘా’ పంజా..

Share

  •  నగరం చుట్టూ ఆరు కార్యాలయాల్లో విజిలెన్స్‌ ఆకస్మిక దాడులు.
  • క్యూర్’ ప్రాంతాలపై ప్రత్యేక నజర్.. గండిపేట తహసీల్దార్, ఉప్పల్‌ ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తన వేగాన్ని పెంచింది. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని కీలక కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, మంగళవారం ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంచలనం సృష్టించారు. గండిపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పటాన్‌చెరులోని విద్యుత్ శాఖ కార్యాలయం వరకు నిఘా నీడన సోదాలు జరగడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పారదర్శక పాలనే లక్ష్యంగా విజిలెన్స్‌ విభాగం డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

నగర శివార్లలో అత్యంత కీలకంగా మారిన గండిపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు, రిజిస్ట్రేషన్ల తాకిడి ఎక్కువగా ఉండే మూసారాంబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు లోతైన తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో దళారుల ప్రమేయం, ఫైళ్ల నిర్వహణపై ఆరా తీశారు. అటు కవాడిగూడలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్-40 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా, పటాన్‌చెరులోని మంజీరా రబ్బర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ, అలాగే అక్కడి టీజీఎస్పీడీసీఎల్ ప్రాంతీయ కార్యాలయంలోని డివిజనల్ ఇంజనీర్ ఆఫీసులోనూ అధికారులు తనిఖీలు జరిపారు.

ఈ ఆకస్మిక తనిఖీల్లో విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మరియు రికార్డుల నిర్వహణలో పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండటం, మరికొన్ని చోట్ల నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గుర్తించిన అక్రమాలపై ఇప్పటికే నివేదికలు సిద్ధం చేస్తున్నామని, బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించే సేవలలో జాప్యం జరిగినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ‘క్యూర్’ ప్రాంతాల్లో ఇటువంటి ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని నిఘా విభాగం హెచ్చరించింది.

Latest