Mahaa Daily Exclusive

  కారేపల్లి అటవీ శాఖలో ‘కంచే చేను మేసిన చందంగా’ అక్రమాలు: అధికారుల అండతోనే కలప అక్రమ రవాణా!

Share

  • నాడు అడవులను అంతం చేశారు… నేడు పల్లెల్లో పచ్చని చెట్లను మింగేస్తున్నారు..
  • కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ లో… కంచే చేను మేస్తోంది..
  • అక్రమ పర్మిట్ల తో అక్రమాలు..

కారేపల్లి, మహా:కారేపల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న నిర్మల హృదయి డిగ్రీ కళాశాల దాని పరిసరాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా పచ్చని చెట్లు నరికి ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరింది… ఈ సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ప్రదేశానికి వెళ్లి ట్రాక్టర్ ను కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అందులో వేప మొద్దులతో పాటు ఇతర అటవీయేతర జాతుల కలప కూడా ఉంది. పట్టుకున్న గంట తరువాత ఫారెస్ట్ అధికారు లు ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ట్రాక్టర్ ను తనిఖీ చేయగా అందులో అటవీఏతర జాతులకు సంబంధించిన కలప మాత్రమే ఉంది కాబట్టి వాటికి కూడా వారు అనుమతులు తీసుకోలేదు కాబట్టి పదివేల రూపాయల జరిమానాను కలప వ్యాపారి బందెల్లి కి విధించి ట్రాక్టర్ను విడిచి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్ లో అటవీ జాతికి చెందిన వేప కలప ఉన్నప్పటికీ ఆ కలపలేదని నిర్ధారిస్తూ ఫారెస్ట్ అధికారులు అక్రమానికి పాల్పడ్డారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి, కొందరు పత్రికా విలేకరులు ఆ ట్రాక్టర్ లో వేప కలప ను చూసి ఫోటోలు కూడా తీసుకున్నారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కలప వ్యాపారి వద్ద మామూలు తీసుకొని ట్రాక్టర్ ను నామమాత్రపు జరిమానాతో వదిలేసారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలప వ్యాపారి కేసు పరిశీలించాల్సిన ఫారెస్టు అధికారి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఏదైనా సాధ్యపడుతుందని ఈ సంఘటనపై బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో జరిగింది కాదు అటవీ రేంజ్ కార్యాలయానికి అర కిలోమీటర్ దూరంలో మంగళవారం కారేపల్లి లో చోటుచేసుకున్న సంఘటన ఇది…. కంచే చేను మేసిన చందంగా ఇలాంటి అక్రమాలు కారేపల్లి అటవీ రేంజ్ లో కోకొల్లలుగా జరుగుతున్నా అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు ఉన్నాయి.
*అతిపెద్ద రేంజ్ లో అడవులు అంతరించాయి…
జిల్లాలోనే అతి పెద్ద రేంజ్ గా ఉన్న కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ లో అడవి ఆనవాళ్లు కోల్పోతోంది. రేంజ్ పరిధిలో 20 వేల ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన అడవులు నాడు నిండు పచ్చదనంతో వున్న అడవులు నేడు ఆక్రమణకు గురై కేవలం గుట్టలు మాత్రమే మిగిలివున్నాయి. ఫారెస్ట్ అధికారులు వాటిని కూడా కాపాడలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. అటవీ భూములను, అటవీ సంపదను, ఏజెన్సీ ప్రాంతాల్లో పెరుగుతున్న పచ్చని చెట్లను కాపాడాల్సిన అటవీ అధికారులు మామూళ్లకు అలవాటు పడి అక్రమాలకు పాల్పడుతున్నారు.
*రంగురాళ్లబోడు లో వందల చెట్లను నరికారు…
కారేపల్లి అటవీ రేంజ్ పరిధిలోని రంగురాళ్ల బోడు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గత ఏడాది నుంచి వందకు పైగా భారీ వృక్షాలను నరికి సుమారు పదెకరాల ఫారెస్ట్ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రమేయం తోనే అటవీ భూమి అక్రమనకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఫారెస్ట్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడం తో అక్కడి ఆక్రమణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. రంగురాళ్ళ బోడు అక్రమణలపై ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు 8 కేసులు నమోదు చేసి నప్పటికీ కబ్జాదారులను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల క్రితం వరకూ ఇక్కడ పనిచేసిన ఫారెస్ట్ సిబ్బంది కూడా కబ్జాదారులకు సహకరించారు కాబట్టి వారు వందలాది చెట్లు మిషన్లతో నరికారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రంగురాళ్లబోడు కబ్జాలను అరికట్టేందుకు సమర్థవంతమైన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ను వేసినప్పటికీ ఫారెస్ట్ ఉన్నత అధికారులు కఠిన చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
*అక్రమ పర్మిట్లు…
కారేపల్లి మండలంలో 41 గ్రామపంచాయతీల్లో మండల కేంద్రమైన కారేపల్లి, అబ్బాయిగూడెం మినహా మిగతా అన్ని పంచాయతీలు ఏజెన్సీ గ్రామాలే. ఈ గ్రామాల పరిధిలోని ,వేప, చింత,తుమ్మ తదితర చెట్లను నరికి కలపను తరలించడానికి వాల్టా చట్టం ప్రకారం అనుమతులు లేవు. కానీ వందలాది ట్రిప్పుల కలప గత కొన్నేళ్లుగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి తరలిపోతోంది. వీటిల్లో చాలా వరకు కారేపల్లి పేరుతో పర్మిట్లు ఇచ్చి కొందరు అటవీ శాఖ సిబ్బందే సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోనీ కలపను నాన్ ఏజెన్సీ గ్రామమైన కారేపల్లి పేరుతో పర్మిట్లు తీసుకుని పర్మిట్లు ఇచ్చిన వారికి కొంత ముట్ట చెప్పి గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమం కొందరి ఫారెస్ట్ సిబ్బంది కనుసన్నల్లోనే సాగుతోంది. నాన్ ఏజెన్సీ గ్రామమైన కారేపల్లి ప్రాంతం రొండు కిలోమీటర్ల పరిధిలో తక్కువ విస్తీర్ణం లోనే ఉంది. ఈ పరిధిలో కొట్టిన చెట్లు నామమాత్రమే.
*300 టేకు చెట్లు ఎలా తరలిపోయాయి..
కారేపల్లి అటవీ రేంజ్ ఆఫీస్ కు రొండో కిలోమీటర్ల దూరంలో పేరుపల్లికి చెందిన ఓ రైతు మల్లన్నగూడెం రోడ్డు ప్రాంతంలో పొలం గట్ల మీద సుమారు 300 టేకు చెట్లను పెంచాడు. ఈ టేకు చెట్లన్నీ పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఎటువంటి అనమతుల్లేకుండా ఈ టేకు చెట్లన్నీ మాయమై ఆ ప్రాంతంలో మొట్లు మాత్రం సాక్ష్యంగా మిగిలాయి. ఆ సాక్షాలను కూడా లేకుండా ఇటీవల వాటిని కూడా తొలగించారు. ఈ టేకు చెట్లను నరికించి అక్రమంగా తరలించిన వ్యవహారం కూడా కొందరి ఫారెస్ట్ సిబ్బంది కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. కారేపల్లి అటవీ రేంజ్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై ఫారెస్ట్ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest