హైదరాబాద్, మహా.
నిత్యం సైరన్ల మోత, సెక్యూరిటీ వాహనాల కాన్వాయ్ మధ్య తిరిగే హోదా ఆయనది. కానీ, ఆ హంగూ ఆర్భాటాలను పక్కనపెట్టి, తోటి ప్రయాణికులతో కలిసి సామాన్యుడిలా మెట్రో రైలెక్కారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. బుధవారం నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో ట్రాఫిక్ చిక్కులను తప్పించుకుని గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని భావించిన ఆయన, మెట్రో మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎర్రమంజిల్ స్టేషన్‌కు చేరుకున్న మంత్రి, ప్రోటోకాల్ హడావుడి లేకుండా స్వయంగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్‌ఫామ్ మీద సాధారణ ప్రయాణికుడిలా నిలబడి రైలు రాగానే లోపలికి వెళ్లారు.
సమయం రద్దీగా ఉండటంతో రైలులో సీట్లు ఖాళీ లేవు. అయినప్పటికీ మంత్రి తన హోదాను ప్రదర్శించకుండా, తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే మియాపూర్ వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తన పక్కన ఉన్న వారితో ఆత్మీయంగా ముచ్చటించి, మెట్రో సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని అంత దగ్గరగా చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యానికి లోనైనా, ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడారు. ఈ క్రమంలో యువకులు, వృద్ధులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడగా, జూపల్లి ఎంతో ఓపికగా అందరితో ఫొటోలు దిగుతూ ప్రయాణాన్ని సాగించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సమయాన్ని ఆదా చేస్తూ గమ్యస్థానాలకు చేరడానికి మెట్రో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వర్షాల సమయంలోనూ, నగరంలోని ప్రధాన కూడళ్లలో రద్దీ పెరిగినప్పుడు మెట్రో సేవలు సామాన్యులకు ఎంతో ఊరటనిస్తాయని కొనియాడారు. మంత్రి ఇలా సాదాసీదాగా మెట్రోలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్‍బీ వరకు ఇలాగే ప్రయాణించి వార్తల్లో నిలిచారు.








