Mahaa Daily Exclusive

  ఏసీబీ వలలో ఎయిర్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ..

Share

  •  లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం.
  •  సోదాల్లో రూ.33.97 లక్షల నగదు స్వాధీనం.

హైదరాబాద్, మహా.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పోలీసు అవుట్‌పోస్టులో అవినీతి తిమింగలాలు ఏసీబీ పంజాకు చిక్కాయి. ఒక కేసులో నిందితుడికి అనుకూలంగా ఛార్జిషీటు దాఖలు చేసేందుకు, అతని కుటుంబ సభ్యులను కేసులో ఇరికించకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్, ఎస్ఐలను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏకంగా రూ.34 లక్షలకు పైగా నగదు లభ్యం కావడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్టులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యు.కె. సిద్ధేశ్వర్, ఇన్‌స్పెక్టర్ సంపాతి కనకయ్యలు ఒక కేసు విషయమై బాధితుడిని వేధిస్తూ రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వ్యూహరచన చేశారు. మంగళవారం సాయంత్రం బాధితుడి నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ బృందం వీరిద్దరినీ పట్టుకుంది. నిందితులు తమ అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ట్రాప్ అనంతరం ఏసీబీ అధికారులు ఇన్‌స్పెక్టర్ కనకయ్య నివాసంలో మెరుపు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో లెక్కలోకి రాని రూ.33,97,000 నగదును చూసి అధికారులు విస్తుపోయారు. నగదుతో పాటు కొన్ని ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ప్రస్తుతం లోతైన విచారణ జరుపుతున్నామని, ఈ ఆస్తుల మూలాలు ఎక్కడివో ఆరా తీస్తున్నామని ఏసీబీ ప్రకటించింది.

నిందితులు సిద్ధేశ్వర్, కనకయ్యలను అరెస్టు చేసిన అధికారులు, వారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో విమానాశ్రయ భద్రతా విభాగంలో పనిచేసే సిబ్బంది అవినీతిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇచ్చారు.