Mahaa Daily Exclusive

  వినోదానికి మళ్లీ పన్ను ‘సెగ’..

Share

  • పాత పద్ధతిని పట్టాలెక్కించేందుకు సర్కార్ సన్నాహాలు.
  •  థియేటర్ల యజమానుల్లో ఆందోళన.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయ వనరులను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన ‘వినోదపు పన్ను’ ను తిరిగి అమలులోకి తీసుకురావాలని సర్కార్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జీఎస్టీ అమలు తర్వాత ఈ పన్నును రద్దు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు మళ్లీ దానిని తెరపైకి తీసుకురావడంపై రాజకీయంగానూ, పారిశ్రామికంగానూ చర్చ మొదలైంది.

ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఈసారి వినోదపు పన్ను కేవలం సినిమా థియేటర్లకే పరిమితం కాబోవటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో జరిగే వివిధ రకాల వినోద కార్యక్రమాలపై కూడా ఈ పన్ను భారం పడే అవకాశం ఉంది. సర్కార్ ఖజానాను నింపుకోవడంతో పాటు, స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టిని పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి పక్కాగా విధివిధానాలను రూపొందించాలని, సామాన్యుడిపై భారం పడకుండా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంపై సినిమా థియేటర్ల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీల రాకతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి తోడు పెరిగిన నిర్వహణ ఖర్చులు తమను కుంగదీస్తున్నాయని వారు వాపోతున్నారు. నగరాల్లో మల్టీప్లెక్స్ సంస్కృతి పెరగడం వల్ల సాదాసీదా థియేటర్లకు ఆదరణ తగ్గిందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మళ్లీ వినోదపు పన్ను విధిస్తే తాము థియేటర్లను మూసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.

మరోవైపు, ఈ పన్ను అమలులోకి వస్తే సినిమా టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సామాన్య ప్రేక్షకులపై కూడా దీని ప్రభావం పడనుంది. ఇప్పటికే పార్కింగ్, క్యాంటీన్ ధరలతో ఇబ్బంది పడుతున్న సగటు సినిమా ప్రేమికుడికి ఈ అదనపు పన్ను శరాఘాతంలా మారే ప్రమాదం ఉంది. ఒకవైపు ఆదాయం పెంచుకోవాలనే పట్టుదలతో ప్రభుత్వం, మరోవైపు ఆర్థిక భారంతో కుదేలవుతున్నామని పరిశ్రమ వర్గాలు.. వెరసి తెలంగాణలో వినోదపు పన్ను వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చే నివేదికపైనే ఈ పన్ను భవిష్యత్తు ఆధారపడి ఉంది.