Mahaa Daily Exclusive

  పంజాబ్‌ ఓటర్ల జాబితాలో భగత్‌సింగ్‌ ఫొటో…

Share

పంజాబ్‌ ఓటర్ల జాబితాలో భగత్‌సింగ్‌ ఫొటో
* ఇప్పటికే సరిచేశామన్న ఎన్నికల అధికారులు
చండీగఢ్‌,మహా.
పంజాబ్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఒక విచిత్రమైన తప్పిదం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. లూథియానా ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఒక ఓటరు పేరుకు ఎదురుగా అమరవీరుడు, మహా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ను పోలిన చిత్రం ప్రచురితమైంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ సోషల్ మీడియా వేదికగా బయటపెడుతూ ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఇంతటి నిర్లక్ష్యం ఏంటని ఆయన మండిపడ్డారు.
అయితే కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపణలపై లూథియానా జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. ఓటర్ల జాబితాలో తప్పుగా ఫొటో పడిన విషయాన్ని గతంలోనే గుర్తించి సరిదిద్దినట్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజా వారింగ్‌ చేస్తున్న వ్యాధులు, ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఖండించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి, అవసరమైన సవరణలు చేపట్టామని వివరించారు.
గతంలో ఆగస్టు 13న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ పొరపాటు దొర్లిన మాట వాస్తవమే అయినప్పటికీ, నిబంధనల ప్రకారం తుది జాబితాను సిద్ధం చేసే సమయానికే ఆ లోపాన్ని సరిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. సరిచేసిన సరైన ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను సోమవారమే ప్రచురించినట్లు స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ, పారదర్శకతపై ఇప్పటికే పలు విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో, పంజాబ్‌లో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Latest