Mahaa Daily Exclusive

  మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన సీనియర్ వైస్‌ప్రెసిడెంట్….భారత్‌కు తిరుగు ప్రయాణం.

Share

న్యూఢిల్లీ, మహా.
ప్రపంచ సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి అత్యంత వేగంగా సాగుతున్న కీలక తరుణంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థకు చెందిన సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ కేశవన్ షన్ముగం తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆలోచింపజేస్తోంది. దాదాపు 23 ఏళ్ల పాటు మైక్రోసాఫ్ట్‌లో ఉన్నత హోదాలో సేవలు అందించిన ఆయన.. తన ఉద్యోగానికి స్వస్తి పలికారు. వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు వీలుగా అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రావాలని ఆయన నిర్ణయించుకోవడం పట్ల టెక్‌ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
మైక్రోసాఫ్ట్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన షన్ముగం.. పలు సాంకేతిక ఆవిష్కరణలలో కీలక భాగస్వామ్యం వహించారు. ముఖ్యంగా ‘ఎక్సెల్’ లో కోపైలట్ అనుసంధానం, ఏజెంటిక్ కృత్రిమ మేధ వ్యవస్థల అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారు. టెక్నాలజీ రంగంలో ఏఐ హవా నడుస్తున్న సమయంలో, కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పటికీ ఆయన ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే భారత్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాకపోయినప్పటికీ, వృత్తి జీవితం కంటే కుటుంబానికే తాము తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావించినట్లు పేర్కొన్నారు. షన్ముగం తీసుకున్న ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని టెక్‌ రంగానికి చెందిన ప్రముఖులు, సహచరులు అభినందిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు. వృత్తి విజయాలతో పాటు కుటుంబ బంధాలకు, బాధ్యతలకు పెద్దపీట వేయడం అభినందనీయమని కొనియాడుతున్నారు.

Latest