జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?.
* కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ధ్వజం.
న్యూఢిల్లీ, మహా.
దేశంలో జనాభా అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, ఓటర్ల జాబితా నుంచి కోట్ల సంఖ్యలో ఓట్లు ఏవిధంగా తగ్గిపోతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముసుగులో ఓటు హక్కును హరించే పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న రేవంత్ రెడ్డి కేంద్ర తీరుపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో దేశంలో 81 కోట్ల ఓట్లు ఉండగా, 2019 నాటికి 91 కోట్లకు, 2023 నాటికి 97 కోట్లకు చేరాయని, కానీ ఇప్పటివరకు సుమారు 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి అకారణంగా తొలగించారని ఆరోపించారు. జనాభా పెరుగుతున్న తరుణంలో ఓట్లు తగ్గడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సామాన్య ప్రజలు, యువత ఓటు హక్కును కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి తొలగిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ విధానాలను ప్రశ్నించే వారి పేర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుంచి గల్లంతు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయనపై ప్రతిపక్షాలు స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఈసీ నియామక ప్రక్రియలోంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గతంలో జరిగిన స్వతంత్ర పోరాటంలాగే, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఓటు హక్కు పరిరక్షణ కోసం మరో పెద్ద పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.






