Mahaa Daily Exclusive

  2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యం..! అణుశక్తి కమిషన్‌ చైర్మన్‌ అజిత్‌ కుమార్‌ మొహంతి..

Share

న్యూఢిల్లీ, మహా.
భారతదేశంలో హరిత ఇంధన రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని భారీస్థాయిలో విస్తరించాలని నిర్ణయించినట్లు అణుశక్తి కమిషన్‌ చైర్మన్‌ అజిత్‌ కుమార్‌ మొహంతి వెల్లడించారు. స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరమైన 2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ బృహత్తర లక్ష్య సాధనలో ప్రైవేట్‌ రంగాన్ని కూడా పెద్దఎత్తున భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు.
అణు విద్యుత్‌ రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానించడం ద్వారా సుమారు రూ.7.5 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అజిత్ కుమార్ మొహంతి అంచనా వేశారు. ఈ ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా 2047 నాటికి సుమారు 30 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం దేశంలో అణు విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం దాదాపు 9 గిగావాట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రియాక్టర్లను నిర్వహిస్తుండగా, మరో 17 రియాక్టర్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది.
అణు విద్యుత్‌ రంగంలో ప్రైవేట్‌ సంస్థల ప్రవేశానికి వీలుగా ప్రభుత్వం ఇప్పటికే తగిన చట్టపరమైన సవరణలు తెచ్చిందని మొహంతి తెలిపారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఒకటి లేదా రెండు ప్రముఖ ప్రైవేట్‌ కార్పొరేట్ సంస్థలు అణు రియాక్టర్ల నిర్వహణ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక మెగావాట్ అణు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని ఆయన వివరించారు.
భారీ పరిశ్రమలైన ఉక్కు, సిమెంట్‌ వంటి రంగాలకు నిరంతరంగా, స్వచ్ఛమైన విద్యుత్‌ను అందించేందుకు చిన్న మాడ్యులర్‌ అణు రియాక్టర్ల వినియోగంపై ప్రభుత్వం గట్టిగా పరిశీలిస్తోంది. తక్కువ కార్బన్‌ ఉద్గారాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో అణుశక్తి కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, దేశీయంగా సమృద్ధిగా లభించే థోరియం వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి భారత్‌ ప్రత్యేకంగా మూడంచెల అణు విద్యుత్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మొదటి దశలో యురేనియంను ఇంధనంగా వాడే రియాక్టర్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ, ఉప ఉత్పత్తులుగా ప్లూటోనియం-239ను పొందుతారు; వాడిన అణు ఇంధనాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లూటోనియంను తిరిగి వెలికితీస్తారు. రెండో దశలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ఈ పదార్థాన్ని ఉపయోగించి అదనపు విచ్ఛిన్న పదార్థాలను ఉత్పత్తి చేస్తారు. మూడో దశలో దేశంలో విరివిగా లభించే థోరియంను అణు ఇంధనంగా మార్చి వాడుకోవడం దీని ప్రధాన లక్ష్యం.
భారతదేశంలోని ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు సముద్ర తీర ప్రాంతాల్లో మోనజైట్ ఖనిజం కలిగిన ఇసుక నిక్షేపాలు భారీగా ఉన్నాయి. వీటి నుంచి థోరియంను సులభంగా వెలికితీసే అవకాశం ఉంది. ఈ దేశీయ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత్ దీర్ఘకాలిక ఇంధన భద్రతను సాధించవచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, తమిళనాడులోని కల్పక్కంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ఇది వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి వస్తే అణు విద్యుత్‌ రంగంలో భారత్ స్వయంసమృద్ధి మరింత బలపడుతుంది. 1969లో ప్రారంభమైన మన దేశ వాణిజ్య అణు విద్యుత్‌ ప్రయాణం.. రియాక్టర్ల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో అసాధారణ నైపుణ్యాన్ని సాధించింది. రాబోయే కాలంలో ప్రైవేట్‌ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక పురోగతి, దేశీయ థోరియం వనరుల వినియోగం భారత్‌ను అణు విద్యుత్‌ రంగంలో తిరుగులేని శక్తిగా నిలపడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.

Latest