Mahaa Daily Exclusive

  జగిత్యాలలో రాజకీయ సంచలనం: జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ.. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం

Share

  • జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ
  • బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
  • గులాబీ మయమైన జగిత్యాల
  • భారీ ర్యాలీతో కేటీఆర్ కు స్వాగతం పలికిన శ్రేణులు

జగిత్యాల, మహా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లా సరిహద్దుకు చేరుకున్న కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ, బాణాసంచా కాలుస్తూ పార్టీ కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. జై కేటీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలతో జగిత్యాల వీధులు హోరెత్తాయి. ఈ పర్యటనలో అత్యంత కీలక ఘట్టం ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ కావడం. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి, ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్వయంగా కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

జీవన్ రెడ్డి నివాసం వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపు గంటకుపైగా సాగిన వీరి భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీలో జీవన్ రెడ్డికి కల్పించబోయే ప్రాధాన్యతపై చర్చలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి బాగుందని తాజాగా వ్యాఖ్యానించడం ఆయన పార్టీ మార్పును దాదాపు ఖాయం చేసింది. ఏప్రిల్ 13న లేదా 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాలలో పార్టీకి ఉన్న పట్టును ఈ భారీ బైక్ ర్యాలీ నిరూపించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు పార్టీలోకి రావడం వల్ల మరింత ఉత్సాహం పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేటీఆర్ చెప్పారు. మొత్తానికి కేటీఆర్ జగిత్యాల పర్యటన అటు కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు, ఇటు ప్రత్యర్థి పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జీవన్ రెడ్డి వంటి మేధావి, సీనియర్ నేత బీఆర్ఎస్ గూటికి చేరితే, అది జిల్లా రాజకీయాల్లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద మార్పుకు దారితీస్తుందని భావిస్తున్నారు.