Mahaa Daily Exclusive

  ఆర్టీసీలో సమ్మె సైరన్: ఊరటగా పెండింగ్ డీఏ విడుదల!

Share

  • ఆర్టీసీ కార్మికుల సమ్మె సమాయాత్తం
  • ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
  • పెండింగ్ డీఏ విడుదల, జనవరి 1 నుంచి అమల్లోకి

హైదరాబాద్, మహా : డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సమాయాత్తమవుతున్నారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈ నెల 23 వ తేదీ నుంచి సమ్మెకు వెళ్ళేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న ఏకైక కరువు భత్యాన్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ 2.1 శాతం పెంపుతో, ఉద్యోగుల మొత్తం డీఏ 52.8 శాతానికి చేరుకుంది. జనవరి నుంచి చెల్లించాల్సిన ఈ పెండింగ్ డీఏ బకాయిలను భవిష్యత్తులో రాబోయే మూడు నెలల కాలంలో, ప్రతి నెలా కొంత చొప్పున విడతల వారీగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

ఉద్యోగులను రక్షించుకుంటాం : మంత్రి పొన్నం

ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేసేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం తార్నాక ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడం, కారుణ్య నియామకాలు చేపట్టడం, గతంలో వివిధ కారణాలతో తొలగించబడిన వారిని త్రీమెన్ కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకోవడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా, పని భారం తగ్గించేందుకు కొత్త నియామకాలు మరియు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సుల కొనుగోలు వంటి కార్యక్రమాలతో సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు.