Mahaa Daily Exclusive

  ఫలితాల భయం.. విద్యార్థి బలవన్మరణం..

Share

  • పాసయ్యాడు.. కానీ తిరిగిరాని లోకాలకు.
  • రాపల్లి గ్రామంలో తీరని విషాదం.

హైదరాబాద్, మహా.

ఖమ్మం జిల్లాలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎక్కడ ఫెయిల్ అవుతానో అన్న అనవసర భయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, ఫలితాలు వెలువడక ముందే ఆ విద్యార్థి తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఆ కుటుంబంలో తీరని చీకటిని నింపింది. ఈ హృదయవిదారక ఘటన మధిర రైల్వే స్టేషన్ సమీపంలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ళ అక్షాంత్ మధిరలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో, తాను పరీక్షల్లో తప్పతాననే తీవ్ర ఆందోళన అక్షాంత్‌లో మొదలైంది. గత కొన్ని రోజులుగా ఈ విషయమై తీవ్ర ఒత్తిడికి గురైన అతను, ఫలితాల ప్రకటనకు కొద్ది గంటల ముందే మధిరలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళ్లముందే భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా పట్టాల మీద విగతజీవిగా పడి ఉండటం చూసి స్థానికులు చలించిపోయారు.

అయితే, విధి ఆడిన వింత నాటకం ఏంటంటే.. అక్షాంత్ ప్రాణాలు తీసుకున్న కొద్దిసేపటికే విడుదలైన ఫలితాల్లో అతను ఘన విజయం సాధించాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 347 మార్కులు సాధించి గౌరవప్రదమైన రీతిలో ఉత్తీర్ణత చెందాడు. తాను పాసయ్యానన్న కనీస సమాచారం కూడా తెలియకుండానే ఆ విద్యార్థి తనువు చాలించడం అందరినీ కన్నీటి పర్యంతం చేస్తోంది. ఒకవేళ మరికొద్ది సేపు ఓపిక పట్టి ఉంటే, ఈరోజు ఆ ఇంట్లో సంబరాలు మిన్నంటేవని, ఫలితాల భయమే అక్షాంత్‌ను పొట్టనబెట్టుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతికందిన కొడుకు విగతజీవిగా మారడంతో అక్షాంత్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే అక్షాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడని ఊహించలేదని వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనతో రాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు పరీక్షల ఫలితాల పట్ల అతిగా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కన్నవారికి కడుపుకోత మిగులుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest