Mahaa Daily Exclusive

  ఎండలకు బీరు తో చిల్..!

Share

  • కిక్కు మార్చిన భానుడు.
  •  లిక్కర్ గ్రాఫ్ డ్రాప్..
  •  బీర్ల విక్రయాల్లో ఆల్ టైమ్ రికార్డు!
  •  రూ.44 వేల కోట్ల దిశగా ఆదాయం.
  • భాగ్యనగరం నుంచి భద్రాద్రి దాకా బీరు జాతర.
  • నాణ్యతపై పెరుగుతున్న అనుమానాలు!

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో వేసవి కాలం కేవలం సాధారణ రుతువుగా కాకుండా అబ్కారీ శాఖ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబడుతోంది. ఏప్రిల్ రెండో వారానికే భానుడు ప్రచండ రూపం దాల్చి 44 డిగ్రీల సెల్సియస్ దాటి నిప్పులు కురిపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలితో పాటు మద్యం వినియోగ విధానం కూడా సమూలంగా మారిపోయింది. సాధారణంగా మందుబాబులు విస్కీ, బ్రాందీ వంటి గాఢత గల మద్యానికి ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ ఈ వేసవిలో ఆ ట్రెండ్ పూర్తిగా తలకిందులైంది. వేడి నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు చల్లని బీర్ల వైపు పరుగులు తీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాల సునామీ కనిపిస్తోంది.
అబ్కారీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెల నుంచే వేసవి సెగలు వినియోగ గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది మార్చి నెలలో 33 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వగా ఈ ఏడాది మార్చి నాటికే ఆ సంఖ్య ఏకంగా 46 లక్షల కేసులకు చేరుకుని అబ్కారీ అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇది దాదాపు 39 శాతం అసాధారణ వృద్ధిని సూచిస్తుండగా ఏప్రిల్ మొదటి పక్షం రోజుల్లోనే 22 లక్షల కేసుల విక్రయాలు జరగడం గమనార్హం. అయితే బీర్ల జోరు ఇలా ఉంటే హార్డ్ లిక్కర్ అమ్మకాలు మాత్రం దారుణంగా పడిపోయాయి. గతంలో నెలకు సగటున 30 లక్షల కేసులు అమ్ముడయ్యే లిక్కర్ ప్రస్తుతం 22 లక్షల కేసులకే పరిమితమై 26 శాతం తిరోగమనాన్ని నమోదు చేసింది. మందుబాబులు చల్లని కిక్కు కోసం హార్డ్ లిక్కర్‌ను పక్కన పెట్టి బీరు బాట పట్టడమే దీనికి ప్రధాన కారణమని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతోంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న మద్యం ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త శిఖరాలను అధిరోహించబోతోంది. 2023-24లో రూ.36,490 కోట్లుగా ఉన్న ఆదాయం 2024-25 నాటికి రూ.40,209 కోట్లకు చేరగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది ఏకంగా రూ.44,500 కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. లిక్కర్ అమ్మకాలు తగ్గినా బీర్ల విక్రయాలు వాల్యూమ్ పరంగా భారీగా పెరగడం వల్ల ఆదాయ సమతుల్యత దెబ్బతినకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ముఖ్యంగా మార్చి 2026లో అంచనా వేసిన రూ.3,400 కోట్ల ఆదాయాన్ని దాటి రూ.3,850 కోట్లు సమకూరడం విశేషం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కేవలం మద్యం ద్వారానే రోజుకు సగటున రూ.110 కోట్ల నుండి రూ.120 కోట్ల వరకు నికర ఆదాయాన్ని ఆర్జిస్తోంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,100 బార్ల ద్వారా వచ్చే లైసెన్స్ ఫీజు రూపంలో మరో రూ.1,200 కోట్లు అదనంగా ఖజానాకు చేరుతున్నాయి.
**జిల్లాల వారీగా విక్రయాల డేటాను పరిశీలిస్తే**
భాగ్యనగరం , దాని పరిసర ప్రాంతాలు రాష్ట్ర బీరు వినియోగంలో సింహభాగాన్ని ఆక్రమించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు కలిపి రాష్ట్ర మొత్తం అమ్మకాల్లో దాదాపు 48 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. రంగారెడ్డి జిల్లాలో 35.5 శాతం వృద్ధి నమోదు కాగా హైదరాబాద్ కోర్ సిటీలో 30 శాతం పెరుగుదల కనిపించింది. ఐటీ కారిడార్ , శివారు ప్రాంతాల్లో వెలసిన పబ్బులు, క్లబ్బులు బీర్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ సగటున 1.5 లక్షల కేసుల బీర్లు ఖర్చవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో వీకెండ్ కల్చర్ తో పాటు పెరిగిన ఉక్కపోత బీరు విక్రయాలకు ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది.
ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్ , కరీంనగర్‌లో ఎండల తీవ్రత 45 డిగ్రీలకు చేరువలో ఉండటంతో అక్కడ బీర్ల విక్రయాలు వరుసగా 28.4 శాతం , 27.2 శాతం వృద్ధి సాధించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జిల్లాల్లో మార్చి నెలలోనే ఎక్సైజ్ డిపోలు ఖాళీ అయ్యే పరిస్థితి రావడంతో అదనపు స్టాకును అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది. రామగుండం, నిర్మల్ వంటి ప్రాంతాల్లో ఎండలు నిప్పులు కురిపిస్తుండటంతో కూలీల నుంచి సామాన్యుల వరకు అందరూ చల్లని బీర్లకే ఓటు వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో హార్డ్ లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గిపోవడం ఎక్సైజ్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండల తీవ్రత తట్టుకోవడానికి ఇది ఏకైక మార్గమని అక్కడి వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణ తెలంగాణ , తూర్పు జిల్లాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ బీరు వినియోగం మాత్రం క్రమంగా పుంజుకుంటోంది. నల్గొండ జిల్లాలో ముఖ్యంగా విజయవాడ జాతీయ రహదారి వెంబడి ఉన్న షాపుల్లో 20 శాతం వృద్ధి కనిపిస్తుండగా ఉమ్మడి వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలు మాత్రం 10 శాతం లోపు వృద్ధితో కొంత వెనుకబడి ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రజలు ఇప్పటికీ హార్డ్ లిక్కర్‌కే కొంత మొగ్గు చూపుతుండటంతో అక్కడ బీర్ల వినియోగం ఇతర జిల్లాలతో పోలిస్తే స్వల్పంగానే పెరిగింది. అయితే ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం , ఆదిలాబాద్‌లలో కూడా 18 శాతం మేర బీర్ల వినియోగం పెరగడం మారుతున్న ప్రజల అభిరుచులకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గిరిజన ప్రాంతాల్లో సైతం బీర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.
అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నప్పటికీ నాణ్యత పరమైన ఫిర్యాదులు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో విక్రయించిన కొన్ని ప్రముఖ బ్రాండ్ల బీరు సీసాల్లో తెల్లటి నలకలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వేసవి డిమాండ్‌ను తట్టుకోవడానికి బ్రేవరీలు ఉత్పత్తిని వేగవంతం చేయడంతో చిల్లింగ్ ప్రక్రియలో లోపాలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు బెల్ట్ షాపుల్లో చిల్డ్ బీర్ల పేరుతో సీసాపై రూ.10 నుండి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్న దోపిడీ పర్వం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినప్పటికీ క్షేత్రస్థాయిలో అదనపు వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో 45 లక్షల కేసుల స్టాక్ అందుబాటులో ఉన్నప్పటికీ మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అబ్కారీ శాఖ మరో 20 లక్షల కేసులకు ఆర్డర్ ఇచ్చింది. సంగారెడ్డిలోని ప్రధాన బీరు తయారీ యూనిట్లు ఇప్పుడు రోజుకు మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా పనిచేస్తూ పెరిగిన డిమాండ్‌ను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రానున్న మే నెలలో విక్రయాలు 55 లక్షల కేసుల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లిక్కర్ అమ్మకాలు తగ్గినా బీర్ల వాల్యూమ్ పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం సమతూకంలో ఉంటుందని అధికార యంత్రాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి 2026 వేసవి తెలంగాణ అబ్కారీ శాఖకు కాసుల పంట పండిస్తూ సరికొత్త రికార్డుల వైపు నడిపిస్తోంది.

Latest