- సీఐఎస్ఎఫ్ అధికారినంటూ
- 67 మంది యువతులను మోసం చేసిన ఘనుడు
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టుతో వెలుగులోకి
హైదరాబాద్, మహా : సీఐఎస్ఎఫ్ అధికారిని అని చెప్పుకుంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులను టార్గెట్‌గా చేసుకున్న ఆ కేటుగాడు పెళ్లిళ్ల కోసం తాను సీఐఎస్ఎఫ్ అధికారిని అని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా సీఐఎస్ఎఫ్ అధికారుల యూనిఫాం వేసుకోవడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ అతడ్ని పట్టుకుని ప్రశ్నించగా అడ్డంగా దొరికిపోయాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి.. తాను ఒక సీఐఎస్ఎఫ్ అధికారిని అంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దర్జాగా తిరుగుతున్నాడు. అయితే అతడి ప్రవర్తన పట్ల శంషాబాద్ పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి ప్రశ్నించగా బాలకృష్ణ తడబడటం, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. అతడు ఫేక్ అధికారి అని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను సీఐఎస్ఎఫ్‌లో పనిచేస్తున్నానంటూ.. యువతులను నమ్మించి.. వారిని బాలకృష్ణ బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు బాలకృష్ణ చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు. యువతులను పెళ్లి పేరుతో మోసం చేసేందుకే తాను ఇలా సీఐఎస్ఎఫ్ అధికారిని అంటూ తిరుగుతున్నట్లు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. తాను సీఐఎస్ఎఫ్ అధికారిని అంటూ ఇప్పటివరకు 67 మంది మహిళలను మోసం చేసినట్లు చెప్పడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.
పోలీస్ అధికారుల వేషం వేసుకుని.. మ్యాట్రిమొనీ డాట్‌కామ్‌లో పలువురు యువతులకు తాను వల వేసినట్లు బాలకృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత వారిని మాటల్లో పెట్టి.. రకరకాల మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో బాలకృష్ణపై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు.. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తును చేపట్టారు.








