.
న్యూఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న నిరసన డ్రామాలను చూసి ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడం చేతగాక రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ ముప్పేట దాడికి తెగబడుతోందని ధ్వజమెత్తారు. గతంలో లోక్సభ స్పీకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని, ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) దిగిపోవాలని కోరారని, చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సైతం రాజీనామా చేయాలంటూ దిగజారి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. వేలాది మందిని సుప్రీంకోర్టు వద్దకు పంపి న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తూ, బెదిరింపులకు దిగడం అత్యంత శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు లేక వరుసగా ఓడిపోతుంటే దానికి ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుందని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రజలదే తప్పన్నట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమతో 200 మంది అధికారులు టచ్లో ఉన్నారంటూ రాహుల్ గాంధీ ఎవరిని బెదిరించాలని చూస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బాబు జగ్జీవన్ రామ్, ఎన్టీఆర్ వంటి మహానాయకులను కాంగ్రెస్ గతంలో తీవ్రంగా అవమానించిన విషయాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేదని గుర్తుచేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీతో పోటీపడుతూ మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ గజం ఎగిరితే, రేవంత్ రెడ్డి రెండు గజాలు ఎగురుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ ఎలాంటి ప్రజాస్వామ్య నిరసనలు, ధర్నాలు చేపట్టాలన్నా నాయకులను గృహనిర్బంధాలు (హౌస్ అరెస్ట్లు) చేస్తున్నారని, చివరకు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తాము ధర్నాలు చేయడానికి అనుమతి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో తమ నిరసనలకు అనుమతి లభించడం లేదంటూ ద్వంద్వ నీతులు మాట్లాడుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి రావడం, ప్రధాని నరేంద్ర మోదీపై నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఢిల్లీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలతో విసిగిపోయిన స్థానిక ప్రజలు, వ్యాపారులు ఆ నిరసన వేదికను మరోచోటుకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.







