Mahaa Daily Exclusive

  అధికారం అజమాయిషీకి కాదు… ప్రజల సాధికారత కోసమే.. ప్రధాని మోదీ..

Share

 

న్యూఢిల్లీ, మహా.

 

నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతికత, డేటా, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అనేవి అత్యంత కీలక శక్తులని, వాటిని కొందరి ప్రయోజనాలకే పరిమితం చేయకుండా కోట్లాది మంది ప్రజలకు నూతన అవకాశాలు కల్పించేందుకు వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ఆయన ప్రసంగించారు. పోటీకి బదులుగా సహకారం, నియంత్రణకు బదులుగా సాధికారతే లక్ష్యంగా వ్యవస్థలు ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ ప్రజలపై అజమాయిషీ చెలాయించడం, వారిని నిరంతరం వ్యవస్థలపైనే ఆధారపడేలా చేయడం లక్ష్యం కాకూడదని, వారిని మరింత బలోపేతం చేసి సాధికారత కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే గత పదేళ్ల కాలంలో దేశంలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైన పునాదులతో స్థిరంగా దూసుకుపోతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. హరిత ఇంధన రంగంలోనూ దేశం అనూహ్య ప్రగతి సాధించిందని, 2014లో కేవలం 75 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ప్రస్తుతం 300 గిగావాట్లకు చేరుకుందని వివరించారు. స్వచ్ఛ ఇంధన విస్తరణతో దేశంలో సరికొత్త ఆర్థిక అవకాశాలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు.

భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు వంటిదని అభివర్ణించిన మోదీ, దేశంలో వందకు పైగా భాషలు, సుమారు 80 వేల వార్తాపత్రికలు, వెయ్యికి పైగా శాటిలైట్ టీవీ ఛానళ్లు ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. దాదాపు 50 కోట్ల మంది భారతీయులు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తమ భిన్నాభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకుంటున్నారని, ప్రజాస్వామ్య చర్చలను విస్తృతం చేయడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు.

Latest