Mahaa Daily Exclusive

  భవిష్యత్తు అవసరాల కోసమే సెమీకండక్టర్లలో పెట్టుబడులు….. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్.

Share


 

న్యూఢిల్లీ, మహా .

 

సెమీకండక్టర్ల రంగంలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టే పెట్టుబడులే భారత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. లాభాలు రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ, ఈ రంగంలో చేసే వ్యూహాత్మక పెట్టుబడులు దేశానికి అపారమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌-2026లో పాల్గొన్న ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ అవసరాలపై విశ్లేషించారు. సెమీకండక్టర్ల పరిశ్రమలో రెండు, మూడు సంవత్సరాల స్వల్పకాలిక లక్ష్యాల కంటే దీర్ఘకాలిక అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ ఉద్ఘాటించారు.

భవిష్యత్తులో దేశానికి ఏ రంగం అత్యంత అవసరమో గుర్తించి అందులో ముందుగానే పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. గతంలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జె.ఎన్. టాటా ఇదే దార్శనికతతో, అప్పట్లో నూతనంగా అభివృద్ధి చెందుతున్న స్టీల్, విద్యుత్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారని ఆయన గుర్తుచేశారు. ఆనాటి వ్యూహాత్మక ఆలోచన దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని, ప్రస్తుత సాంకేతిక యుగంలో సెమీకండక్టర్ల రంగం కూడా అటువంటిదేనని ఆయన వివరించారు. అయితే, సెమీకండక్టర్ల పరిశ్రమను నిర్మించడం అంత సులభమైన విషయం కాదని, ఇందుకు భారీ పెట్టుబడులతో పాటు కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరమని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక చర్చా కార్యక్రమంలో చంద్రశేఖరన్‌తో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, బ్లాక్‌స్టోన్ సంస్థ అధ్యక్షుడు జోనాథన్ గ్రే పాల్గొన్నారు.

Latest